తిరుమల : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిస్ట్యూట్ మెడికల్ సైన్స్ నూతన డైరెక్టర్ ( SVIMS ) గా డాక్టర్ జగదీష్ ( Jagadish ) నియామకమయ్యారు. ఈ సందర్భంగా తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ అనుభవజ్ఞులైన, గొప్ప పేరు, దూరదృష్టి గల వైద్యులైన డాక్టర్ జగదీష్ నేతృత్వంలో స్విమ్స్ ఆసుపత్రిలో అత్యున్నతమైన వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్విమ్స్ ఆసుపత్రిని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, త్వరలో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు. నూతన డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తిరుపతిని ఇంటిగ్రేటెడ్ మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తామని వెల్లడించారు. స్విమ్స్ ఆసుపత్రిలో వైద్యంపై రోగుల్లో నమ్మకం కలగించి ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యం అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవలను మరింత విస్తరించి పేదరోగులకు ఆర్థిక భారం తగ్గిస్తామని పేర్కొన్నారు.