Duvvada Srinivas | వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూతురు హైంధవితో కలిసి శనివారం మధ్యాహ్నం టెక్కలిలోని దువ్వాడ శ్రీను ఇంటి ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా దువ్వాడ వాణి మాట్లాడుతూ.. శ్రీనును సస్పెండ్ చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వాణి చేసిన ఆరోపణలపై దివ్వల మాధురి తీవ్రంగా స్పందించారు.
వాణికి సిగ్గు, లజ్జ అనేవి లేవని దివ్వల మాధురి విమర్శించారు. మద్యం మత్తులో వాణి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భగవద్గీత పట్టుకుని లీలావతి అబద్ధాలు చెబుతారా అని ప్రశ్నించారు. తనను రాజకీయాల్లోకి పిలిచింది వాణినే అని తెలిపారు. జిల్లా మహిళా అధ్యక్షురాలి పదవి ఇస్తామని మోసగించారని అన్నారు. గడపగడపకు కార్యక్రమంలో దువ్వాడతో కలిసి పాల్గొన్నా అని చెప్పారు. పార్టీ పరంగానే దువ్వాడతో కలిసి పనిచేశానని పేర్కొన్నారు. వాణికి నైట్ తాగింది ఇంకా దిగలేదేమో అని ఎద్దేవా చేశారు. భర్తపై ప్రేమ ఉంటే సస్పెండ్ చేయాలని అడుగుతారా? అని ప్రశ్నించారు.
ఎవరు బజారు మనుషులో అందరికీ తెలుస్తోందని మాధురి అన్నారు. తాను ఎప్పుడైనా వాణి గురించి అలా మాట్లాడానా? అని అడిగారు. టీడీపీకి మద్దతిచ్చామని వాణి చెబుతున్నారని.. అప్పుడు వాణికి తన భర్త గుర్తురాలేదా అని ప్రశ్నించారు. వాణిని ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఓటమికి కారణం వాణినే అని ఆరోపించారు. టెక్కలి ఆమ అడ్డా.. మమ్మల్ని అడ్డుకునేది ఎవరు అని సీరియస్ అయ్యారు. నన్ను టెక్కలిలో ఉండొద్దని చెప్పడానికి వాణి ఎవరని మండిపడ్డారు. తాను నడిరోడ్డుపైకి రావడానికి కారణం వాణినే అని అన్నారు. దువ్వాడతో ఉంటున్నానని ఎవరికైనా చెప్పానా అని ప్రశ్నించారు. ఎవరి అండదండలతో వాణి రెచ్చిపోతుందని అడిగారు. దువ్వాడ ఇంటిపై ఎందుకు దాడికి వెళ్లిందని ప్రశ్నించారు. దువ్వాడ ఫోన్ చేస్తే పోలీసులు స్పందించలేదని తెలిపారు. వాణికి రాజకీయ పిచ్చి ఎక్కువగా ఉందని ఆరోపించారు. దువ్వాడకు టికెట్ రాకుండా చేసే కుట్ర జరుగుతుందని విమర్శించారు.
దువ్వాడ ఇంటి ముందు శనివారం మధ్యాహ్నం నిరసనకు దిగిన వాణి.. శ్రీను, ఆయన తల్లి లీలావతి, మాధురిపై తీవ్రంగా నిప్పులు చెరిగారు. తన గురించి దువ్వాడ శ్రీనివాస్ నీచంగా మాట్లాడటం సబబేనా అని వాణి ప్రశ్నించారు. ఎలాంటి వాళ్లను జగన్ పార్టీలో ఎలా ఉంచుకుంటారని ప్రశ్నించారు. దువ్వాడను వెంటనే ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయాలని, పార్టీ నుంచి బహిష్కరించాలని జగనన్న కోరుతున్నా అని అన్నారు. దీనిపై వైసీపీ కచ్చితంగా ఆలోచించాలని.. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
దువ్వాడ శ్రీను తల్లి లీలావతి వ్యాఖ్యలపైనా వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. లీలావతి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేం ఎవరితో మందు తాగామో ఆమే చెప్పాలని డిమాండ్ చేశారు. తన గురించి నీచంగా మాట్లాడటం సబబేనా అని ప్రశ్నించారు. తన డబ్బులతోనే దువ్వాడ ఎదిగారని ఆమె అన్నారు. తన ఆస్తులను తనకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. లీలావతిని దువ్వాడ అమ్మా అని పిలవరని.. తల్లీకొడుకుకు అస్సలు పడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధురి టెక్కలిలో ఎలా తిరుగుతుందో చూస్తామని హెచ్చరించారు. దువ్వాడ వల్ల తమ కుటుంబం, సొసైటీ ఇబ్బంది పడుతుందని అన్నారు. అందుకే దువ్వాడను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.లీలావతి అబద్ధాలు చెబుతున్నారని హైంధవి కూడా ఆరోపించారు.