విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సీపీఎం సీనియర్ నేత మధు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వత్తాసు పలకడం జగన్ మానుకోవాలని హితవు పలికారు. కమ్యునిస్టు పార్టీలపై నిందలు వేయడం తగదని సూచించారరు. సమస్యలను పరిష్కరించకుండా ఏ ప్రభుత్వం మొండికేసినా.. ఆయా వర్గాలకు కమ్యునిస్టు పార్టీలు అండగా ఉంటాయనే విషయం మరిచిపోవద్దన్నారు.
తాజాగా ఒక కార్యక్రమంలో కమ్యూనిస్టులపై సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడంతో మధు ఈ విధంగా స్పందించారు. పశ్చిమ కృష్ణా జిల్లా సీపీఎం మహాసభలు జరిగాయి. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మధు.. పేదల పక్షాన నిలిచే కమ్యూనిస్టుల పనితీరును సీఎం జగన్ విస్మరిస్తున్నారని, కేవలం బీజేపీని వెనకేసుకురావడానికే ఆయన పనికొస్తారని విమర్శించారు.
కమ్యునిస్టులకు ప్రభుత్వాలతో సంబంధం లేదని, ప్రజా సమస్యలే ముఖ్యమని మధు చెప్పారు. ఔట్ సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది? అని మధు ప్రశ్నించారు. ఎదుట ఎర్రజెంటా, అజెండా మాత్రం పసుపు జెండా అంటూ జగన్ వ్యాఖ్యలు చేయడంపై మధు కౌంటర్ ఇచ్చారు. ఆయన బీజేపీ విధానాలను రాష్ట్రంలో అమలుచేస్తున్నారని మండిపడ్డారు.