(CP Ratna Tata) విజయవాడ: వంగవీటి రాధా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టీకే రత్న టాటా చెప్పారు. ఆయనకు ఎలాంటి ముప్పు లేదని, ఆయన భద్రతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రత్న టాటా మీడియాతో మాట్లాడారు.
తనకు ప్రాణహాని ఉందంటూ వంగవీటి రాధా చేసిన ప్రకటనపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపామని సీపీ రత్న టాటా వెల్లడించారు. రాధ ప్రకటనపై పోలీసుల విచారణతో సంబంధం లేకుండా ప్రభుత్వం వెంటనే గన్మెన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ అంశంపై పోలీసు శాఖతో పాటు పలు ఏజెన్సీలు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపాయని సీపీ చెప్పారు. రాధా ఇంటి పరిసరాలను, నగరంలోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించామని, రెక్కీ నిర్వహించినట్లుగా ఆరోపిస్తున్న దానికి నిర్దిష్ట ఆధారాలు లేవన్నారు. ఆయనను ఎవరూ వేధించేందుకు ప్రయత్నించలేదని, ఆయన ఇంట్లో ఎవరూ రెక్సీ నిర్వహించలేదని సీపీ వెల్లడించారు.
అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నదని, అనుమానాస్పద సంఘటనలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై పోలీసు శాఖపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను రత్న టాటా తోసిపుచ్చారు. ఎలాంటి క్రిమినల్ ఘటన జరగలేదన్న ప్రకటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం లేదన్నారు. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు.