అమరావతి : హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కూడా కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa) తెలిపారు. విభజన హామీల సాధనే మా పార్టీ విధానమని బుధవారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. వైసీపీ ప్రాంతీయ సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి (YV Subba reddy) చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, బాధ్యత గల వ్యక్తులు అలా మాట్లాడరని పేర్కొన్నారు.
ఉమ్మడి రాజధాని విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను ప్రస్తావించారని హైదరాబాద్ (Hyderabad) గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. కేంద్రం చట్టబద్ధంగా రాష్ట్రాన్ని విభజించిన తరువాత రాజధాని విషయంలో మళ్లీ తాము ఎందుకు అడుగుతామని ప్రశ్నించారు. కేంద్రానికి ఇష్టముంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, ఇంకా పరిష్కారం కాని వాటిపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని అన్నారు.
టీటీడీ మాజీ చైర్మన్ , వైసీపీ ప్రాంతీయ సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి నిన్న ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరికొద్ది రోజుల పాటు కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతామని వ్యాఖ్యనించారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు న్యాయ స్థానంలో కేసు నడుస్తుండడం వల్ల ఈ కేసు పూర్తయ్యేంత వరకు రాజధానిని జూన్ 2 వరకు ఉన్న గడువును పొడగించాలని కోరాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు వివాదస్పదమవువతుండడంతో మంత్రి బొత్స బుధవారం రాజధాని హైదరాబాద్‌పై సమాధానమిచ్చారు.