అమరావతి: డిప్యుటేషన్‌పై కేంద్రానికి పంపే ఐఏఎస్ అధికారుల ఎంపిక నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ శుక్రవారం లేఖ రాశారు.
ఐఏఎస్ అధికారుల సర్వీసు నిబంధనల్లో కేంద్రం సవరణలు ప్రతిపాదించింది. దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం కోరింది. రాష్ట్రాల నుంచి కేంద్రానికి డిప్యుటేషన్‌పై పంపించే ఐఏఎస్ అధికారుల విషయంలో సవరణ తీసుకురావాలని నిర్ణయించిన కేంద్రం చొరవను సీఎం జగన్ అభినందించారు. అయితే, రాష్ట్రాలు నిరభ్యంతర పత్రాలను విడుదల చేసిన తర్వాతనే డిప్యుటేషన్ ఖరారవుతున్నప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. డిప్యుటేషన్‌పై వచ్చే ఐఏఎస్ అధికారి రిపోర్ట్ చేసే గడువును నిర్ణయించే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ తీసుకువస్తున్న తాజా సవరణలపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉన్నపళంగా కీలక భాద్యతల్లో ఉన్న అధికారులు వెళ్లిపోతే పాలనలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.