ప్రకాశం జిల్లా : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చీమకుర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో హాజరైన వారిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ పాట సభలో నవ్వులు కురిపించింది. వద్దని జగన్ వారించినా వినకపోవడంతో ఆయనే స్వయంగా వెళ్లి వెంకాయమ్మను బలవంతంగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు.
మహానేతతో కలిసి బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉన్నదని సీఎం జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తి ప్రతీ ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడానికి ఈ విగ్రహాల ఆవిష్కరణే నిదర్శనమని అన్నారు. రైతులకు సంక్షేమం అందించి, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేదల సంక్షేమానికి పర్యాయపదంగా వైఎస్సార్ మారారని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్తున్నానని, మ్యానిఫెస్టోలో తెలిపిన 95 శాతం హామీలు నెరవేర్చామని, దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉంటే మరింత మేలు చేస్తానని హామీ ఇచ్చారు.
ఏప్రిల్ 14న విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. గాంధీ, అంబేద్కర్, ఫూలే, అల్లూరి, ప్రకాశం, వైఎస్సార్ వంటి మహానాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, వారి మంచిపనులకు, భావాలకు మరణం లేదని జగన్ అభిప్రాయపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు 1,2 టన్నెలు పనులు వైఎస్ ప్రారంభించగా.. టీడీపీ హయాంలో నిలిచిపోయాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులను తాము అధికారంలోకి రాగానే ప్రారంభించామని, 2023 సెప్టెంబర్ కల్లా పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. కొత్త జడ్సీ కార్యాలయం భవనం నిర్మాణం కోసం రూ.20 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మొగిలిగుండాల ప్రాజెక్టుకు బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల ప్రాజెక్టుగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రానైట్ పరిశ్రమలో స్లాబ్ విధానాన్ని మళ్లీ తీసుకువస్తామని జగన్ చెప్పారు. చిన్న గ్రానైట్ పరిశ్రమల కరెంట్ ఛార్జీలను యూనిట్‌కు రూ.2 తగ్గిస్తామని ప్రకటించారు.