Road Accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండల పరిధిలోని రాయికోట గ్రామ పరిధిలో ఓ బొలెరో వాహనం అదుపు తప్పి, లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక వ్యక్తి మరణించాడు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే, పోలీసులతోపాటు సివిల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం దవాఖానలకు తరలించారు.
కాగా మరణించిన వ్యక్తి నూకరాజు అనే యువకుడని గుర్తించారు. పాడేరు మండలం రాయికోట నుంచి 20 మంది వలస కూలీలు రాజమండ్రికి బయలుదేరారు. వారు బయలుదేరిన కొద్ది సేపటికే బొలెరో వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంతో రాయికోట గ్రామంలో విషాదం నెలకొంది.