(Babu met Radha) అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ వంగవీటి రాధాను కలిశారు. ఇవాళ సాయంత్రం తాడేపల్లిలోని వంగవీటి రాధా ఇంటికి వెళ్లి స్వయంగా వెళ్లిన చంద్రబాబు ఆయనను పరామర్శించారు. తన ఇంటికి వచ్చిన చంద్రబాబును రాధా సాదరంగా ఆహ్వానించి ఇంట్లోకి తోడ్కొని వెళ్లారు. రాధాతో పాటు ఆయన తల్లి చెన్నుపాటి రత్నకుమారిని కూడా చంద్రబాబు పలకరించారు. రెక్కీ జరిగిన విషయంపై రాధాతో ఆరా తీశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వంగవీటి రాధా విషయంలో ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నదని ఈ సందర్భంగా మీడియాతో చంద్రబాబు అన్నారు. సీసీ టీవీ పుటేజీ ద్వారా ఎవరు రెక్కీ నిర్వహించారో తెలుసుకోవచ్చన్నారు. దోషులను పట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని చెప్పారు. రెక్కీ నిర్వహించి వారం రోజులు కావస్తున్నా ఇప్పటివరకు దోషులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రెక్కీ చేసిందెవరు? ఎందుకు చేశారు? అన్నది ఇప్పటి వరకూ తేల్చలేకపోయారని ఆరోపించారు. దీనికి పక్కా ఆధారాలున్నప్పటికీ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.