తిరుపతి : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుంచి 18 వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 9వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు నిర్వహించారు. ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సూర్యకుమారాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు..
10-06-2022 (శుక్రవారం) – ధ్వజారోహణం పెద్దశేష వాహనం
11-06-2022 (శనివారం) – చిన్నశేష వాహనం హంస వాహనం
12-06-2022 (ఆదివారం) – సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
13-06-2022 (సోమవారం) – కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
14-06-2022 (మంగళవారం) – మోహినీ అవతారం గరుడ వాహనం
15-06-2022 (బుధవారం) – హనుమంత వాహనం గజ వాహనం
16-06-2022 (గురువారం) – సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
17-06-2022 (శుక్రవారం) – రథోత్సవం అశ్వవాహనం
18-06-2022 (శనివారం) – చక్రస్నానం ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. జూన్ 13వ తేదీ సాయంత్రం 5 నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రూ.500 చెల్లించి ఇద్దరు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా ఇస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు జరుగనున్నాయి.