అమరావతి : ఉప రాష్ట్రపతి ఎన్నికపై వైసీపీ ( YCP ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే( NDA) ప్రతిపాదించిన అభ్యర్థి రాధాకృష్ణన్‌కే తమ మద్దతు ఉంటుందని వైసీపీకి చెందిన కీలక నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ) ప్రకటించారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ( Congress ) పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ ఏర్పడిందని అన్నారు. గతంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీయేకు మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. అదేవిధంగా పార్లమెంట్లో పలు బిల్లుల ఆమోదానికి మద్దతు ఇచ్చినట్లు గుర్తు చేశారు. నంబర్ గేమ్ ఉండొద్దనే ఉద్దేశంతో ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. అప్పట్లో ప్రణబ్ ముఖర్జీకి మద్దతిచ్చామని తెలిపారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చామని అన్నారు.
రైతు చట్టాలకు, 2019లో ఆర్టికల్ 370 రద్దుకు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ చట్ట ప్రతిపాదనకు వైసీపీ మద్దతు ఇచ్చామని తెలిపారు. 2013లో అవిశ్వాస తీర్మాన సమయంలోనూ మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలిపామని బొత్స వెల్లడించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ పేరు ఖరారు చేసిన అనంతరం బీజేపీకి చెందిన నాయకులు వైసీపీ నాయకులను సంప్రదించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలుపాలని కోరిన మీదట వైసీపీ సానుకూలంగా స్పందించి ఎన్డీయేకు మద్దతును ప్రకటించింది.