కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఒకరు ఇటలీలో దుర్మరణం పాలయ్యారు. స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన అతడు అలల ధాటికి సముద్రం లోపలికి కొట్టుకుపోయాడు. మృతుడు కర్నూలు నగరానికి చెందిన దిలీప్‌గా గుర్తించారు. దాంతో బాలాజీనగర్‌లోని ఆయన నివాసంలో విషాదచాయలు అలుముకున్నాయి.
కర్నూలు నగరంలోని బాలాజీనగర్‌లోని బాలాజీ అపార్ట్మెంట్లో చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతులు నివసిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు బీఎస్సీ అగ్నికల్చర్ పూర్తిచేశారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇటలీలోని మిలాన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. 2019 సెప్టెంబర్‌లో కాలేజీలో చేరిన దిలీప్.. గత ఏడాది ఏప్రిల్‌లో తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఐదు నెలలు గడిపాడు.
ఉద్యోగంలో చేరిన తర్వాత తిరిగి కర్నూలు వస్తానని చెప్పి వెళ్లిన దిలీప్.. స్నేహితులతో కలిసి శుక్రవారం సాయంత్రం మాంటెరుస్సో బీచ్‌కు వెళ్లాడు. బీచ్‌లో సరదాగా గడుపుతున్న సమయంలో పెద్ద అలలు రావడంతో దిలీప్ సముద్రంలోకి కొట్టుకుపోయాడు. దిలీప్‌ను రక్షించేందుకు కోస్ట్ గార్డ్స్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. గంటన్నర అనంతరం దిలీప్ మృతదేహాన్ని గుర్తించారు. దిలీప్ భౌతికకాయాన్ని ఇండియా తెప్పించేందుకు భారత ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.