Vijayawada Utsav | విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది.
వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఆలయ భూముల్లోకి తరలించిన గ్రావెల్, మట్టి, కంకరను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఈ భూములను మళ్లీ యథాస్థితికి తీసుకురావాలని సూచించింది.
గొడుగుపేట వేంకటేశ్వర స్వామి భూములను దేవాదాయ శాఖ ఇప్పటికే 56 రోజులకు లీజుకు ఇచ్చింది. దీనికి సంబంధించిన మొత్తాన్ని కూడా దేవస్థానానికి ఉత్సవ్ నిర్వాహకులు చెల్లించారు. కానీ ఆలయ భూముల్లో ఉత్సవాల నిర్వహణను నిర్వహించవద్దని ఏపీ హైకోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సూచించింది. ఈ మేరకు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా, దసరా నవరాత్రుల సందర్భంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు ‘విజయవాడ ఉత్సవ్’ పేరిట కృష్ణా నది తీరంతో పాటు నగరంలోని మైదానాల్లో సంగీత, సినీ, సాంస్కృతిక వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉత్సవ్ నిర్వాహకులకు షాకిచ్చినట్లు అయ్యింది.