అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పెంపుపై (Pension Hike) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పింఛన్లను రూ.4 వేలకు పెంచుతూ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో పింఛన్‌ను అందిచనున్నారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పుకళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవీ బాధితులు, కళాకారులకు రూ.3 వేలు పెన్షన్‌గా అందుతున్నది. కాగా, పెరిగిన పెన్షన్‌ను ఏప్రిల్ నెల నుంచి అందించనున్నారు. జూలై 1న వీరికి 3 నెలల పెంచిన పెన్షన్‌తో రూ.7 వేలు అందిస్తారు.
పింఛన్‌తోపాటు మరో నాలుగు కీలక ఫైళ్లపై సీఎం చంద్రబాబు గురువారం సంతకాలు చేశారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లు ఉన్నాయి.