Vijayasai Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ తన ఫక్తు రాజకీయ క్రీడలకు తెరతీశారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈసారి చంద్రబాబు వడ్డించిన చీవాట్లు, పరుషమైన దూషణలు, తిట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులే తాజా టార్గెట్ అయ్యారని చెప్పారు. ఈ కీలక శాఖలన్నీ కూడా పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలే కావడం గమనించాల్సిన విషయమని పేర్కొన్నారు.
చంద్రబాబు తెలివిగా నిందను పవన్ కల్యాణ్‌పైకి పరోక్షంగా నెట్టివేస్తున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ తరహా నక్క తెలివితేటలతో ఉపముఖ్యమంత్రి విశ్వసనీయతను దెబ్బదీయడమే ముఖ్యమంత్రి లక్ష్యమని వేరే చెప్పాల్సిన పనిలేదని చెప్పారు. పక్కా లెక్కలతో ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న ఈ వ్యూహం చంద్రబాబు మార్కు రాజకీయమని అన్నారు. అంతేకాదు 2014, 2024 ఎన్నికల్లో తన విజయానికి తాను ఏ నాయకుడి జనాదరణను అత్యధికంగా ఉపయోగించుకున్నాడో ఆ నాయకుడి పేరు ప్రతిష్ఠలను మంటగలపడమే చంద్రబాబు ఎత్తుగడ అని విమర్శించారు. భవిష్యత్తులో తన కుమారుడికి ముప్పుగా పరిణమిస్తుందనే బలీయశక్తిని అణచివేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్న తన ట్రేడ్ మార్కు వ్యూహం ప్రజలకు అర్ధమై ఉంటుందని అన్నారు.
చంద్రబాబును టార్గెట్ చేయడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్‌ను సపోర్టు చేసినట్లుగా విజయసాయిరెడ్డి కామెంట్లు చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు. ఏపీకి నాయకత్వం, ప్రాతినిధ్యం వహించడానికి ఏపీలోని ఎన్డీయే నాయకుల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అర్హుడని తాను నమ్ముతున్నట్లుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఆయన ఆదర్శవంతమైన వ్యక్తి అని కొనియాడారు. యువ రాష్ట్రానికి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేడని చంద్రబాబుపై పరోక్షలు విమర్శలు గుప్పించారు.