అనంతపురం : జల్సాలకు అలవాటుపడి వాహనాల దొంగలుగా మారి చివరకు పోలీసులకు చిక్కిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల వైనం అనంతపురంలో చోటు చేసుకుంది. గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లు పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద ఉన్న వాహనాలను దొంగిలించి వాటిని విక్రయించిన అనంతరం వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డారు.
కేవలం జిల్లాలోనే కాకుండా కర్నాటక రాష్ట్రం బళ్లారిలోనూ వాహనాలను దొంగిలించారు. పోలీసుల తనిఖీలో వీరిని పట్టుకుని విచారించగా వీరి వద్ద నుంచి వివిధ రకాల 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు, వీటి విలువ రూ.16 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.