గుంటూరు : గుంటూరు జిల్లాలో ఓ సర్పంచ్ ప్రభుత్వానికి తన నిరసన గళాన్ని వినిపించారు. వినూత్నంగా నిరసన చేపట్టి గ్రామ ప్రజలతోపాటు జిల్లా అధికారుల దృష్టిని ఆకర్శించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన నిధులు లేకపోవడంతో.. ఇలా నిరసన వ్యక్తం చేయడం మినహా మరో దారి కనిపించలేదని విచారం వ్యక్తం చేస్తున్నాడా సర్పంచ్. ఈ వినూత్న నిరసన వివరాల్లోకెళితే..
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కాట్రపాడు గ్రామ సర్పంచ్‌గా మేదరమెట్ల శంకర్ ఉన్నారు. తమ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే, అందుకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా మద్ధతు లభించకపోవడంతో ఏ ఒక్క పని చేయలేకపోయాడు. దాంతో ప్రభుత్వానికి, అధికారులకు తన నిరసన వినిపించాలని నిర్ణయించారు. ఆ మేరకు పంచాయతీ పాలకవర్గ సభ్యులను వెంటబెట్టుకుని పారిశుద్ధ్య కార్మికుడిగా అవతారం ఎత్తారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన చెత్త సేకరణ రిక్షాను నడిపిస్తూ, విజిల్ ఊదుకుంటూ గ్రామంలో తిరిగారు. సర్పంచి చెత్త సేకరిస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు తొలుత ఆశ్చర్యపోయినా తర్వాత తేరుకుని ఆయనను అభినందించారు.
పంచాయితీకి ఏవిధమైన సొంత ఆర్థిక వనరులు లేవని, గ్రామానికి కేంద్ర ప్రభుత్వం 14,15 ఆర్థిక సంఘాల నిధులు రూ.6 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మార్గంలో తీసుకున్నదని సర్పంచ్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించే స్థితిలో లేకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు పనులకు రావడంలేదని, వారి పని తాను చేపట్టి నిరసన వ్యక్తం చేయడంతోపాటు పేరుకుపోయిన చెత్తను తొలగించవచ్చునని ఇలా పారిశుద్ధ్య కార్మికుడిగా అవతారం ఎత్తినట్లు వెల్లడించారు. విద్యుత్ దీపాలను కొనేందుకు నిధులు లేకపోవడంతో పాతవాటిని రిపేరింగ్ చేయిస్తున్నట్లు సర్పంచ్ శంకర్ తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం తమ నిరసనను గుర్తించి నిధులు ఇవ్వాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.