Arrest : పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట పారిపోయి వివాహం చేసుకుంది. అనంతరం దైవ దర్శనం కోసం తిరుమలకు వెళ్లింది. సరిగ్గా అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నూతన దంపతులను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. దైవ దర్శానికి వస్తే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారని షాకయ్యారు. ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారికి కూడా ఏమీ అర్థం కాలేదు. ఇంతకూ ఆ కొత్త జంటను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన సాంబశివరావు అలియాస్ శివ, అలేఖ్య గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇరు కుటుంబాల పెద్దలకు వారి పెళ్లి ఇష్టం లేదు. దాంతో రెండు రోజుల క్రితం ఇళ్ల నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. దాంతో అలేఖ్య కుటుంబ సభ్యులు విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో వారి కోసం ఎంక్వయిరీ చేసిన పోలీసులు.. కొత్త జంట శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్తున్నట్లు గుర్తించారు. విషయాన్ని తిరుచానూరు అధికారులకు తెలియజేశారు.
దాంతో కొత్త జంట ఓ ప్రైవేటు వాహనంలో తిరుచానూరు సమీపంలోకి వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భవానీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో అలేఖ్య.. తామిద్దరం గత 11 ఏళ్లుగా ప్రేమించుకున్నామని, ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని చెప్పారు. పైగా ఇద్దరం మేజర్లమని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. కాగా కొత్త జంటను భవానీపురం పోలీసులకు అప్పగించనున్నట్లు తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్ తెలిపారు.
కాగా అలేఖ్య, శివలు 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో గురువారం ఇళ్ల నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. అలేఖ్య కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తుండగా తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అలేఖ్య తల్లిదండ్రులకు తమ వివాహం నచ్చకపోవడంతో తమపై పగ పెంచుకున్నారని పెళ్లి కొడుకు శివ ఆరోపిస్తున్నాడు. అలేఖ్య కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు.