తిరుమల : పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.

మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రాలు, భరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, మాను సంపంగి, ఇతర పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.
శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్( EO Anil Kumar Singhal) మీడియాతో మాట్లాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే ఆ దోష నివారణకు బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చే కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం జరిగిందని చెప్పారు. మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు. ఇందుకోసం 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తామని చెప్పారు. తమిళనాడు నుంచి ఐదు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు.

