HomeAgricultureBasics Of Frost Protection For Horticultural Crops
ఉద్యాన పంటల్లో సస్య రక్షణ
బొప్పాయి : జనవరిలో బొప్పాయి చెట్లలో కాండం కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉన్నది. మొక్కల మొదళ్ల దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా ఈ తెగులును నివారించవచ్చు. లీటర్ నీటిలో 10 గ్రా. బోర్డో మిశ్రమం కలిపి, వారం రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు మొక్కల మధ్య తడపాలి. లీటర్ నీటిలో 10 గ్రా. ట్రైకోడెర్మా పొడిని కలిపి, మొక్కల మొదళ్లు బాగా తడిసేలా పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే, లీటర్ నీటిలో 2 గ్రా. రిడోమిల్ ఎంజైమ్ కలిపి మొదళ్లు, కాండాన్ని తడుపుతూ పోయాలి.
చీనీ నిమ్మ : తీవ్రమైన చలి వల్ల చీనీ నిమ్మలో పూత, పిందె రాలి దిగుబడి తగ్గుతుంది. 10 లీటర్ల నీటిలో 2 మి.లీ. ప్లానోఫిక్స్ కలిపి మొక్కలపై పిచికారీ చేయడం వల్ల పూత, పిందె రాలడాన్ని అరికట్టవచ్చు.
గులాబీ : గులాబీ తోటలో బూడిద తెగులు కనిపిస్తుంది. దీని నివారణ కోసం లీటర్ నీటిలో 3 గ్రా. నీటిలో కరిగే గంధకం పొడిని కలిపి, పిచికారీ చేయాలి.
మల్లె : జనవరి రెండో వారంలోగా మల్లె తోటల్లో కొమ్మల కత్తిరింపు, ఆకు దూయడం పూర్తి చేయాలి. నవంబర్లో కత్తిరింపు చేసిన తోటలో చిగుళ్లపై సూక్ష్మపోషకాలైన జింక్ సల్ఫేట్ 2 నుంచి 5 గ్రా., మెగ్నీషియం సల్ఫేట్ 5 గ్రా. లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మామిడి : మామిడి పూత సమయంలో తేనె మంచు పురుగు, తామర పురుగు, బూడిద తెగులు ఆశించే అవకాశం ఉన్నది. వీటిని నివారించేందుకు లీటర్ నీటిలో 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్తోపాటు 2.5 గ్రా. కార్బెండజిమ్, మాంకోజెబ్ మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయాలి.