బ్రాయిలర్ కోళ్ల పరిశ్రమను తీవ్ర నష్టానికి గురిచేసే వ్యాధుల్లో ‘కాక్సిడయోసిస్’ ఒకటి. ‘ప్రొటోజోవా’తో ఈ వ్యాధి వ్యాపిస్తుంది. రోగం వచ్చిన కోళ్లలో అధికంగా మృత్యువాత పడుతాయి. కోలుకున్న పిల్లల్లో బరువు పెరుగుదల నిలిచిపోతుంది. దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. మేతతోపాటు ‘కాక్సిడయోస్టాట్’ సరైన మోతాదులో వాడకుంటే.. ఈ వ్యాధి వస్తుంది. 11 రోజుల పిల్లల నుంచి 8 వారాల కోడి దాకా.. ఎప్పుడైనా ఈ వ్యాధి బ్రాయిలర్ పిల్లలకు సోకవచ్చు. వ్యాధికి గురైన పిల్లలు సుస్తీగా ఉంటాయి. ఎప్పుడూ మూలల్లో దాగి కనిపిస్తాయి. ఎరుపు రంగులో రెట్ట వేస్తాయి. మేత, నీటిని తక్కువగా తీసుకుంటాయి. వ్యాధితో మరణించిన పిల్లల పేగులు ఉబ్బి.. రక్తంతో ఉంటాయి.
మేతతోపాటు నీటిలోనూ ‘కాక్సీడయోస్టాట్’ మందులను తగిన మోతాదులో వాడితే ఈ రోగాన్ని నివారించవచ్చు.