గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. రాష్ట్ర సర్కారు నిధులు మంజూరు చేసింది. మండల స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా స్థాయికి, జిల్లాలో అత్యుత్తమంగా ఆడిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు. నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట్ గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా జైనథ్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్యే జోగు రామన్న, నార్నూర్ మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాల, కళాశాల మైదానంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు.
– నిర్మల్, మే 15(నమస్తే తెలంగాణ)
నిర్మల్, మే 15 (నమస్తే తెలంగాణ) : వేసవి సెలవులను వృథా కానీయకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల, జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు సోమవారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నిర్మల్ మండలంలోని వెం గ్వాపేటలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని 18 మండలాల పరిధిలో ఈ క్రీడా పోటీ లు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.
మండల స్థాయిలో అన్ని గ్రామాల నుంచి సుమారు 380 జట్లు వివిధ పోటీల్లో పాల్గొనేందుకు తరలిరావడంతో పల్లెల్లో ఆటల సంబురం అంబరాన్ని తాకింది. మండల స్థాయి పోటీలకు బుధవారం చి వరి రోజు కావడంతో అదేరోజు జిల్లా స్థాయిలో పాల్గొనే క్రీడాకారులను కూడా ఎంపిక చేయనున్నారు. కాగా, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రతి గ్రామంలో ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. దీంతో గ్రామీణ యువత అదే గ్రామంలో వివిధ రకాల ఆటలు ఆ డుకునేలా అవకాశం కల్పించింది.
తాజాగా గ్రామా ల్లో ప్రతిభ కలిగిన ప్రతి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆటల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. క్రీడలతో దేహదారుఢ్యం, మానసికోల్లాసం, మంచి భవిష్యత్ ఉంటుందనే సందేశంతో విద్యార్థులు, యువతను సన్నద్ధం చేస్తున్నది.
ఈ నెల 15 నుంచి 31 వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు నిర్వహించాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిర్మల్ జిల్లా యంత్రాంగం, జిల్లా యువజన, క్రీడల శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది. ఆయా మండలాల అధికారులు ఇప్పటికే క్రీడల నిర్వహణపై స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించి పోటీలను విజయవంతం చేయడంలో భాగస్వాములను చేశారు. గ్రామాల ప్రజా ప్రతినిధుల సహకారంతో పెద్ద మొత్తంలో యువత పాల్గొనేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఇదీ షెడ్యూల్..
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఖానాపూర్, ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాల్లో సీఎం కప్‌కు సంబంధించిన క్రీడల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి 17 వరకు మండల స్థాయిలో పోటీలు జరుగుతాయి. ఆయా పోటీల్లో 15 నుంచి 36 ఏళ్ల వయసు కలిగిన యువతీ, యువకులు పాల్గొంటారు. మండల స్థాయిలో అథ్లెటిక్స్ విభాగంలో100, 400 మీటర్ల పరుగు పందెం ఉంటుంది. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్ పోటీలు నిర్వహిస్తారు. నిర్మల్ జిల్లాలో మొదటి రోజు ఒక్క ఫుట్‌బాల్ మినహా అన్ని విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఫుట్‌బాల్ పోటీలకు ఎవరూ ఆసక్తి చూపలేదు. కాగా, ఆయా పోటీల్లో గెలుపొందిన జట్లు, క్రీడాకారులను ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు పంపిస్తారు. జిల్లా స్థాయిలో మరికొన్ని అదనపు క్రీడలు ఉంటాయి. మండల స్థాయిలో నిర్వహించిన పోటీలతో పాటు అదనంగా స్విమ్మింగ్, లాంగ్‌జంప్, షాట్‌ఫుట్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ (పురుషులు), హ్యాండ్‌బాల్ (మహిళలు) పోటీలను నిర్వహించనున్నారు. వీటిల్లో గెలుపొందిన క్రీడాకారులు, జట్లను రాష్ట్ర స్థాయిలో ఈ నెల 28 నుంచి 31 వరకు నిర్వహించే సీఎం కప్‌లో పాల్గొనేందుకు పంపిస్తారు. కాగా, జిల్లా స్థాయిలో అదనంగా జరిగే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను మండల స్థాయిలో ఎంపిక చేయనున్నారు.
ప్రత్యేక కమిటీల ఏర్పాటు..
మండల, జిల్లా స్థాయిలో సీఎం కప్ క్రీడలను విజయవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో కమిటీ చైర్మన్‌గా ఎంపీపీ, సభ్యులుగా జడ్పీటీసీ, కన్వీనర్‌గా ఎంపీడీవో, సభ్యులుగా తహసీల్ధార్, ఎంఈవో, ఎస్ఐ, పీడీలు, పీఈటీలు, మున్సిపల్ కమిషనర్లను నియమించారు. ఆసక్తి కలిగిన సీనియర్ క్రీడాకారులకు కొన్ని చోట్ల కమిటీల్లో స్థానం కల్పించారు. అన్ని రకాల పోటీలకు అనువుగా క్రీడా మైదానాలను సిద్ధం చేశారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సీఎం కప్ పోటీల్లో ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులు పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు. మండల స్థాయిలో ఐదు రకాల పోటీలను నిర్వహిస్తుండగా, జిల్లా స్థాయిలో 11 రకాలు, రాష్ట్ర స్థాయిలో 18 రకాల క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు సీఎం కప్ పేరుతో నగదు బహుమతులు అందజేయనున్నారు.
ప్రధానఅంశాలు..
పండుగ వాతావరణంలో పోటీలు..
సీఎం కప్ క్రీడా పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా 18 మండల కేంద్రాల్లో పోటీలు నిర్వహించాం. గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణంలో పోటీలు జరుగుతున్నాయి. పోటీలను తిలకించేందుకు పల్లె ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మండలానికి రూ.15 వేలు, జిల్లా స్థాయి పోటీలకు రూ.75 వేలు మంజూరు చేసింది. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారాన్ని తీసుకుంటున్నాం. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 380 టీంలు పోటీల్లో పాల్గొన్నాయి. మూడు రోజుల పాటు మండల స్థాయిలో నిర్వహించే పోటీల్లో గెలుపొందిన వారిని ఈ నెల 22 నుంచి 24వరకు జిల్లా స్థాయిలో ఆడిస్తాం. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతాం.
– క్రాంతికుమార్, జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి, నిర్మల్