కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 12(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని మహాగాం వద్ద నేషనల్ హైవేను అనుకొని నాలుగు ఎకరాల బిళ్ల దాకలా పోరంబోకు పట్టా(బీడీపీపీ) భూమి ఉంది. ఈ భూమిని షేక్ నూర్, షేక్ బషీర్‌లు దశబ్దకాలంగా సాగు చేసుకుంటున్నారు. వీరికి 2004 సంవత్సరంలో ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది. అయితే 2023లో ఆర్టీవో చెక్‌పోస్టుతోపాటు, కార్యాలయ నిర్మాణానికి హైవే పై రెండెకరాల స్థలం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు మహారాష్ట్ర సరిహద్దున గల వాంకిడి మండలంలోని మహాగాంలోని హైవేపై స్థలాన్ని పరిశీలించారు. షేక్ నూర్, షేక్ బషీర్‌లు సాగు చేసుకుంటున్న బీడీపీపీ(పట్టా 62,107) భూమిని ఆర్టీవో చెక్‌పోస్టు నిర్మాణానికి ఎంపిక చేశారు.
వీరికి ఉన్న నాలుగెకరాల్లో రెండెకరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ప్రతిఫలంగా బాధితులకు ఆర్టీవో కార్యాలయంలో ఏదైన తాత్కాలికంగా ఉపాధి కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. దీంతో బాధితులు రెండెకరాల స్థలాన్ని అధికారులకు అప్పగించారు. అయితే ఈ స్థలంలో ఆర్టీవో చెక్‌పోస్టు, కార్యాలయాన్ని నిర్మించలేదు. స్థలాన్ని ఇచ్చిన బాధితులు కూడా సాగు చేయకుండా వదిలేశారు. ఇటీవల ప్రభుత్వం ఆర్టీవో చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో ఈ స్థలంపై కన్నేసిన కబ్జాదారులు ఆ స్థలంలో దాబా నిర్మించారు.
మిగతా స్థలాన్ని ఆక్రమించేందుకు మరికొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేషనల్ హైవే సరిహద్దు స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. ఒక ఎకరాకు రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ధర పలుకుతున్నది. మహారాష్ట్ర సరిహద్దును అనుకొని ఉన్న భూములకు కూడా డిమాండ్ అధికంగానే ఉంది. ఇంత విలువైన ప్రభుత్వ భూములను అక్రమార్కులు యథేచ్ఛగా అక్రమిస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నోటీసులు జారీ చేస్తాం..
వాంకిడి మండలంలోని మహా గాంలో గల ఆర్టీవో చెక్‌పోస్టు కోసం కేటాయించిన బీడీపీపీ స్థలం ఆక్రమణకు గురైనట్లు మా దృష్టికొచ్చిం ది. దీనిపై విచారణ చేపడు తున్నాం. ఆ స్థలాన్ని ఆక్ర మించి నిర్మాణాలు చేసినట్లు గుర్తించాం. ఆక్రమణదారులకు త్వరలోనే నోటీసులు జారీ చేసి చర్యలు చేపడుతాం. చెక్‌పోస్టు కోసం కేటాయించిన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకులా చర్యలు తీసుకుంటాం. – కవిత, తహసీల్దార్, వాంకిడి.
మాకు ఇప్పించాలి..
నాలుగు దశాబ్దాలుగా మేము వాంకిడి మండలంలోని మహాగాంలో గల నాలుగెకరాల బీడీపీపీ స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. మా నాన్న షేక్‌నూర్, మా అన్న షేక్ జమీర్ పేరిట బీడీపీపీ(సర్వే నంబర్ 62/107)లకు 2004లో ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది. 2023లో ఆర్టీవో చెక్‌పోస్టు కోసం అధికారులు స్థలం కావాలని అడిగారు. ఈ భూమిలో నుంచి రెండెకరాల స్థలాన్ని అధికారులకు ఇచ్చాం. దీని కోసం మాకు ఆర్టీవో చెక్‌పోస్టులో ఏదైనా తాత్కాలిక ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు చెక్‌పోస్టు నిర్మాణం చేయలేదు. ఇటీవల ప్రభుత్వం ఆర్టీవో చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో కొంత మంది ఈ స్థలాన్ని ఆక్రమించి దాబాలు నిర్మించారు. అధికారులు పట్టించుకోవడం లేదు. మేము ఆర్టీవో చెక్‌పోస్టు కోసం ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వం కబ్జాలోనే ఉంచుకోవాలి. లేకపోతే మా స్థలాన్ని మాకు తిరిగి అప్పగించాలి. – షేక్ అశ్వాక్, వాంకిడి