ఎదులాపురం, జూలై 4 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఉదయం స్వల్ప జల్లులతో ప్రారంభమైన వర్షం రోజంతా కొనసాగడంతో జనజీవనం కొంత మేర ప్రభావితమైంది. ఈనెల రెండో వారంలో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వచ్చే రెండు రోజులపాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా లో-లెవల్ వంతెనలు, వాగులు, చెరువుల్లో నీటి ప్రవాహం పెరుగుతున్న. వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో ప్రజలు వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు.