ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్ కనిపించింది. 2022కు గుడ్‌బై చెప్పిన ప్రజానీకం.. 2023కి ఘన స్వాగతం పలికింది. యువతీ యువకులు కేరింతలు కొడుతూ హోరెత్తించారు. కేక్‌లు కట్ చేసి.. మిఠాయిలు పంచుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక వ్యాపారులు స్పెషల్ ఆఫర్లతో ఆకట్టుకోగా, మద్యం దుకాణాలు కొనుగోలు దారులతో కిక్కిరిసి కనిపించాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పొలంలో రైతులు, మహిళా కూలీలు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
నిర్మల్ టౌన్/ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 31 : ఉమ్మడి జిల్లా ప్రజలు తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. 2023 సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటలకు కేకులు కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. యువతీ యువకులు డీజే పాటలపై స్టెప్పులేసి హోరెత్తించారు. వాడవాడలా చిన్నా.. పెద్ద సంబురాల్లో మునిగి తేలారు. బెకరీలు, స్వీట్ హౌస్‌లు, రెస్టారెంట్ల ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకున్నాయి. కేకులు, స్వీట్లు, చికెన్, మటన్, ఫిష్, బిర్యానీలకు భలే గిరాకీ అయ్యింది. రంగులు, పూలు, పండ్లు, అమ్మకాలు జోరుగా సాగాయి. మద్యం దుకాణాల ముందు బారులు కనిపించాయి. నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసు అధికారులు ఆంక్షలు విధించారు. కాలనీలు, అపార్టుమెంట్లలోనే వేడుకలు జరుపుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. శనివారం రాత్రి నుంచే మొదలైన న్యూ ఇయర్ సంబురాలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. రాత్రి 7 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. పట్టుబడిన వారిని స్థానికి పోలీసు స్టేషన్లకు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు..
కొత్త ఏడాది, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆదివారం, సోమవారం భక్తులు పెద్ద ఎత్తున వేంకటేశ్వర స్వామి దర్శనానికి తరలి వెళ్లనున్నారు. సోమవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఉత్తర ద్వార దర్శనాన్ని ఉదయం 6 గంటల నుంచి భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి ముక్త రవి తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బేకరీలు.., విం దులు, వినోదాల కోసం భోజనశాలలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, పండ్ల దుకాణాల వద్ద సందడి కన్పించింది. కొత్త సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలోని అయ్యప్ప హరిహరక్షేత్రం, సాయిబాబా, దుర్గామాత, బ్రహ్మపురి, దేవరకోట, నగరేశ్వరవాడ, బుధవార్‌పేట్ శివాలయం తదితర ఆలయాల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తు ఏర్పాట్లు చేశారు.
ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన..
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 31 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావలలోని జ్యోతి బాఫూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన 2023 ఆకృతి అందరినీ ఆకట్టుకున్నది. విద్యార్థులు పలు ఆకృతుల్లో చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. వారనిని పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఆర్సీవో రాథోడ్ గోపిచంద్, ప్రిన్సిపాల్ రంగన్న, వైస్ ప్రిన్సిపాల్ శ్రీలత, వార్డెన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.