మంచిర్యాలటౌన్, జూన్ 8 : ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా పనిచేసిన ఎండీ మునీర్ ఇక్కడి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారని టీయూడబ్ల్యూజే హెచ్-143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. టీయూడబ్ల్యూజే హెచ్-143 మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాలలో మునీర్ సంస్మరణ సభ నిర్వహించారు. అల్లంనారాయణ, దివాకర్‌రావుతో పాటు నాయకులు, జర్నలిస్టులు మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మునీర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుగా పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమంలో మునీర్ చురుకుగా పాల్గొన్నారన్నారు. మాజీఎమ్మెల్యే దివాకర్‌రావు మా ట్లాడుతూ మునీర్‌తో తనకు చాలా ఏళ్ల అనుబంధం ఉన్నదని, అనేక విషయాలను తాను అతనితో చర్చించేవాడినన్నారు.
టీబీజీకేఎస్ నాయకులు రామ్మూర్తి మాట్లాడుతూ మునీర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని, సింగరేణి ఏరియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మునీర్ పేరిట ఉత్తమ జర్నలిస్టు అవార్డులు ఇచ్చేందుకు కృషిచేస్తామని, మునీర్ చరిత్రను పుస్తక రూపంలో తీసుకువస్తామని నిర్ణయం తీసుకున్నామన్నారు. మునీర్ సోదరుడు సందాని మాట్లాడుతూ చిన్నతనం నుంచి మునీర్ ఉద్యమాల్లో ఎలా పాల్గొనేవారో, ఎందుకు ఉద్యమ పంథాలో నడవాల్సి వచ్చిందో వివరించారు. ఇఫ్టూ జాతీయ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ పలు ఉద్యమాల్లో మునీర్‌తో కలిసి తాము పనిచేశామని, ఉద్యమ భావాలు కలిగిన వ్యక్తి కాబట్టే అతనంటే తమకు ఎంతో ఇష్టం ఉండేదన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజే హె-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, కోశాధికారి యోగానంద్, జిల్లా కన్వీనర్ దాసరి ఉమేశ్, కో కన్వీనర్లు చెట్ల రమేశ్, రేణికుంట్ల శ్రీనివాస్, ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ రవినాయక్, సీపీఐ ఎంఎల్ నాయకులు లాల్‌కుమార్, పీవోడబ్ల్యూ నాయకురాలు మంగ, రచయిత, కవి సుందిళ్ల రాజన్న, మునీర్ కుమారుడు మయూర్, మిత్రులు యాదిరెడ్డి, అబ్బాస్, సదాశివరెడ్డి పాల్గొన్నారు.
మందమర్రి, జూన్ 8 : ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్టు మునీర్ విగ్రహాన్ని సింగరేణి ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో రెవల్యూషన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణకు వినతి పత్రం అందించారు. మంచిర్యాలలో ని ర్వహించిన సంస్మరణ సభలో కలిసి విన్నవించారు. సంస్థ ఉపాధ్యక్షుడు అక్బర్, మర్రి దీపక్, నోముల కృష్ణ, వెంకటేశ్, శ్రీనాధ్, జాఫర్ పాల్గొన్నారు.