కాసిపేట, మార్చి 27 : ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టగా, ఓ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి నాలుగు గంటలపాటు నరకయాతన అనుభవించాడు. ఈ ఘటన కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోమగూడెం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గురువారం తెల్లవారుజామున జరిగింది. సోమగూడెం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఓ ఇనుము లోడ్‌తో ఉన్న లారీ ఆగింది. మధ్యప్రదేశ్ నుంచి బెంగళూర్ వైపునకు ఐరన్ లోడ్‌తో వెళ్తున్న మరో లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. అందులో (ఢీకొట్టిన లారీ) ఉన్న డ్రైవర్ గుర్జిత్ సింగ్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారమందుకున్న కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పెట్రోకార్ ఏఎస్ఐ బూర రవీందర్, బ్లూకోల్ట్స్ పీసీ సాజన్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
మంటలు చెలరేగకుండా ముందుగా ఫైర్ ఇంజిన్‌తో నీళ్లు చల్లారు. క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్‌కు ఆక్సిజన్, ఫ్లూయిడ్స్ అందించి చికిత్స చేశారు. క్యాబిన్లో కాళ్లు విగిరి నాలుగు గంటల(ఉదయం ఐదింటి నుంచి ఉదయం తొమ్మి దింటి వరకు) పాటు డ్రైవర్ నరకయాతన పడ్డాడు. పోలీసులు, 108, ఫైర్ సిబ్బంది డ్రైవర్‌కు ధైర్యం చెప్పకుంటూ అతి కష్టం మీద బయటకు తీశారు. ఆపై 108లో మంచిర్యాలలోని దవాఖానకు తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింది నుంచి వాహనాలను మళ్లీంచారు. డ్రైవర్‌ను కాపాడేందుకు కృషి చేసిన కాసిపేట ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, పెట్రో కార్ ఏఎస్ఐ బూర రవీందర్, బ్లూకోల్ట్స్ పీసీ సాజన్, హోంగార్డ్ సత్తన్న, 108 సిబ్బంది సంపత్, తిరుపతి, కొమురయ్య, రవి, ఫైర్ సిబ్బంది, నేషనల్ హైవే సిబ్బందిని స్థానికులు అభినందించారు.