ఆదిలాబాద్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రెండో విడుత కాంగ్రెస్ టికెట్ల పంపిణీ వ్యవహారం కల్లోలం రేపుతోంది. ఏండ్లుగా జెండా మోసినవారికి కాకుండా పారాచ్యూట్ నేతలకు కేటాయించడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. హస్తం అధిష్టానంతో ఆమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తులకు, ఇతర ప్రాంతాల నుంచి వలసొచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని బహిరంగంగానే నిరసనకు దిగుతున్నారు. మొత్తానికి మూడు రోజులుగా టికెట్ల విషయంలో రెండు జిల్లాలు అట్టుడుకుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని, డబ్బుల మూటలిచ్చినోళ్లకే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకుడు సంజీవ్‌రెడ్డి హాజరుకాలేదు. బోథ్‌లో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీకి పార్టీ సీనియర్లు గైర్హాజరయ్యారు. ఖానాపూర్ విషయంలో అధిష్టానం నిర్ణయంపై ఉట్నూర్ జడ్పీటీసీ చారులత రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ రెండో విడుత టికెట్ల పంపిణీ వ్యవహారం ఆదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీలో కల్లోలం సృష్టిస్తోంది. ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ టికెట్లను కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కష్టకాలంలో జెండా మోసిన వారికి కాదని పారాచ్యూట్, మూటలిచ్చిన నాయకులకు టికెట్లు ఇచ్చారని మూడు నియోజకవర్గాల్లో సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్‌లో సోమవారం ‘సేవ్ కాంగ్రెస్ ఫ్రం ఆర్ఎస్ఎస్’ పేరిట నియోజకవర్గ కార్యకర్తలు సమావేశం నిర్వహించగా డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, సీనియర్ నాయకులు సంజీవ్రెడ్డిలు హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు తాము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని నేతలు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం కార్యకర్తల సమావేశాన్ని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఏఐసీసీ పరిశీలకులు, కర్ణాటక ఎమ్మెల్సీ రాథోడ్ ప్రకాశ్ హాజరయ్యారు. టికెట్ ఆశించిన సాజిద్‌ఖాన్, గం డ్రత్ సుజాత, సంజీవ్‌రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరుకాలేదు. బోథ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వన్నెల అశోక్ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించగా.. టికెట్లు ఆశించిన సీనియర్లు నరేశ్ జాదవ్, ఆడే గజేందర్లు వారి అనుచరులు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
ఖానాపూర్ విషయంలో అన్యాయం చేశారు.. : ఉట్నూర్ జడ్పీటీసీ చారులత రాథోడ్
కాంగ్రెస్ అధిష్టానం ఖానాపూర్ టికెట్ విషయంలో తనకు అన్యాయం చేసిందని ఉట్నూర్ జడ్పీటీసీ చారులత రాథోడ్ మండిపడ్డారు. పార్టీ లో నాయకులతో ఆమె చర్చించారు. పార్టీలో మ హిళలకు కనీస గౌరవం లేదన్నారు. తనతోపాటు ఆసిఫాబాద్ టికెట్ ఆశించిన సరస్వతికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టికెట్లు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ ఇతర పార్టీల గురించి ఎలా మాట్లాడుతోందని ప్రశ్నించారు. 15 సంవత్సరాలుగా తాను పార్టీకి సేవ చేస్తున్నానని, కష్టకాలం లో జెండాను మోసినట్లు తెలిపారు. పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో తనను జడ్పీ చైర్మన్‌గా ప్రకటించి డబ్బులు ఖర్చు పెట్టించారని, ఇత ర పార్టీల్లో చేరమని తనకు అవకాశాలు వచ్చినా ఖానాపూర్ టికెట్ వస్తుందనే ఆశతో నిరాకరించినట్లు తెలిపారు. సీనియర్లను కాదని పారాచ్యూట్, డబ్బుల మూటలు పట్టుకుని వచ్చిన వారికి టికెట్లు కేటాయించారని ఆరోపించారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉండకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ఆశించిన తనను ఇప్పటివరకు పార్టీ నాయకులు ఫోన్ చేసి పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై టికెట్‌ను కేటాయించారని, అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. కార్యకర్తలతో చర్చించి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్నారు.