Holi Celebrations | చెన్నూర్ టౌన్/మామడ/భైంసా టౌన్/ దిలావర్పూర్ : ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, మనుషులంతా ఒక్కటే అనే సందేశం ఇచ్చే పండుగే హోలీ. రంగులను ప్రేమగా ముఖాలకు పులుముకుంటూ పెద్దలు, రంగులు నింపిన పిచికారీలతో చిన్నారులు వీధుల్లో చేసే సందడి అంతా ఇంతా కాదు. వాడవాడనా రంగురంగుల దృశ్యాలు ఆవిష్కృతమయ్యే కలర్ఫుల్ పండుగ ఇదేనంటే అతిశయోక్తి కాదు.
హోలీకి ముందు రోజు రాత్రి కాముడి దహనం మొదలవుతుంది. ఇది జాజిరి ఆటకు ముగింపు. చీడాపీడా తొలగి, మానవులందరికీ సర్వ సుఖాలు కలగాలని ఆశిస్తూ, ఇంట్లోని పాత వస్తువులను కూడళ్ల వద్ద దహనం చేస్తుంటారు. ఆ బూడిదను బొట్టుగా పెట్టుకొని శారీరక, మానసిక ప్రశాంతత కలగాలని వేడుకోవడం ఆనవాయితీ. హోలీ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ వర్ణ రంజితమైన పండుగ వెనుక మరో పురాణగాథ కూడా ఉంది. పరమేశ్వరుడికి తపోభంగం కలిగించి ప్రణయం వైపు మరల్చేందుకు ఇంద్రప్రేరితుడైన మన్మథుడు యత్నిస్తాడు. సుమ బాణాల తాకిడికి తోడు వసంత రుతు సృష్టి కూడా జరగడంతో శివుడికి తపోభంగం కలుగుతుంది. కోపోద్రిక్తుడైన శివుడు త్రినేత్రంతో కాముడిని దహిస్తాడు. నాటి నుంచి దుఃఖ హేతువయిన కామాన్ని అణిచివేసుకోవడమనే పరమార్థ సూక్తిననుసరించి కామదహనం చేయడం, తర్వాత హోలీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని చెబుతారు.
ప్రాచీనకాలంలో రంగుల కోసం మోదుగ పూలు వాడేవారు. ఇవి చర్మానికి ఎంతో శోభ తెచ్చేవి. మోదుగపూలను ఎండబెట్టి దాని నుంచి రంగులు తయారుచేయవచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలుచేసేదే గాక, రోగాలకు దివ్యమైన ఔషధంలా పని చేస్తుందంటారు. ఇలాంటి రంగులు పూసుకోవడం ద్వారా సంతోషం, ఆనందం కలుగుతాయి. ఇక రసాయనాలు కలిపిన రంగులు పూసుకోవడం వల్ల లేనిపోని చర్మరోగాలు అంటుకుంటాయి.
హోలీ పుట్టుక గురించి పురాణగాథలనేకం ఉన్నాయి. ‘హోలిక’ అనే రాక్షసి తాను నివసించే పరిసరాల్లోని పిల్లలను ఎత్తుకుపోయి తినేసేదట! దీంతో ఆ ప్రాంత ప్రజలంతా ఏకమై హోలికను పట్టుకుని కాల్చి, చంపారట! అలా నాటి నుంచి హోలిక పేరిట ఏటా హోలీ పండుగ జరుపుకుంటున్నారని ప్రతీతి.
ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల్లో హోలీ సందడి కనిపించింది. విద్యార్థులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.