ఆదిలాబాద్ : బీఆర్ఎస్ (BRS ) ఎమ్మెల్యేల అక్రమ అరెస్టుల ( Illegal Arrest ) ను నిరసిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని నిర్మల్, ఆదిలాబాద్ రహదారిపై మాజీ మంత్రి జోగు రామన్న ( Jogu Ramanna ) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మాజీ మంత్రిని అరెస్టు చేసిన పోలీసులు వాహనంలో తరలిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు వాహనానికి అడ్డుగా నిలిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను పక్కకు జరిపి వాహనాన్ని ముందుకు తీసుకుపోతుండగా మరో పలుమార్లు అడ్డుకున్నారు.
మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతుంటే వారిపై దౌర్జన్యం చేయ డం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేం తవరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయని వెల్లడించారు.