నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 27 : మిర్చి ఉత్పత్తులకు ధర రాకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది సాగు తక్కువగా ఉండి, దిగుబడి కూడా తక్కువగా రావడంతో ధర అధికంగా పలికింది. దీంతో ఈ యేడాది రైతన్నలు మిర్చి సాగుపై మొగ్గు చూపారు. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, సారంగాపూర్, కుంటాల, కుభీర్, లక్ష్మణచాంద, లోకేశ్వరం, తానూరు, భైంసా మండలాల్లో 20 వేల ఎకరాలకు పైగానే మిర్చి సాగు అయినట్లు అధికారులు తెలిపారు. గతేడాది మాత్రం 5 వేల ఎకరాలకు మించి సాగు కాలేదు. అయితే ఈసారి ధర వస్తుందనే ఆశతో సాగు పెంచారు. సెప్టెంబర్లో మిర్చి వేయగా ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తున్నది. ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. తెగుళ్ల బెడద, వాతావరణం అనుకూలించక పోవడంతో మరో రూ.20 వేల వరకు ఖర్చు అయినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశ పడ్డప్పటికీ 15 క్వింటాళ్లు కూడా రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమ్ముకోవడానికి అవస్థలే..
భైంసా, ధర్మాబాద్, భోకర్, ఖమ్మం, వరంగల్ మార్కెట్లకు మిర్చిని తీసుకెళ్లి అమ్ముకోవాల్సి వస్తున్నది. వరంగల్ మార్కెట్ 400 కిలోమీటర్లు.. భోకర్, ధర్మాబాద్ మార్కెట్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. భైంసాలో మార్కెట్ ఉన్నా ధర లభించడం లేదు. ప్రారంభంలో క్వింటాలుకు రూ.22 వేల ధర లభించినప్పటికీ.. నెల రోజుల్లోనే రూ.8 వేలు తగ్గింది. ప్రస్తుతం రూ.12 వేలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చులు కూడా తడిసి మోపెడు అవుతున్నాయి. దీంతో మిర్చి అమ్ముకోలేక, నిల్వ ఉంచుకోలేక అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ సౌకర్యం, ధర లభించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
రూ.8 వేలు తగ్గింది..
ఐదెకరాల్లో మిర్చి సాగు చేసిన. రూ.8 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. ఇప్పుడిప్పుడే పంట చేతికొస్తున్నది. ప్రారంభంలో రూ.20 వేలు ఉండే. ఇప్పుడు రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. ధర లభించకపోవడంతో గిట్టుబాటు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. విత్తనాలు, ఎరువులు, రసాయనిక మందులు, కూలీ రేట్లు పెరిగినా ధర మాత్రం పెరుగకపోవడంతో పెట్టుబడి వస్తే చాలు అనిపిస్తున్నది. ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి.
– ఫారూక్, రైతు, ఓల.
ఖమ్మం, వరంగల్ మార్కెట్కు తీసుకెళ్తున్నా..
స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో అమ్ముకోవడా నికి ఖమ్మం, వరంగల్ మార్కెట్లకు తీసుకెళ్లా. నాణ్యత పేరిట క్వింటాలుకు రూ.15 వేలకు మించి ఇవ్వలేదు. రవాణా ఖర్చులకే రూ.10 వేలు అయ్యాయి. గతేడా ది మాదిరిగా మిర్చికి లాభం వస్తుందని ఆశపడ్డాం. కానీ.. నిరాశే ఎదురైంది. లాభా లు ఏమో కానీ.. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. స్థానిక మార్కెట్లోనే మద్ద తు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలి.
– నర్సింలు, రైతు.