భీమిని, ఆగస్టు 3 : మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో ప్రభుత్వ పశువుల దవాఖాన పరిధిలో పశువైద్యం సకాలంలో అందక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, సమయ పాలన పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక ఆదివారం వస్తే విధులకు ఎవరూ రావడం లేదని, దవాఖాన మూసి ఉంటున్నదని ఆరోపించారు. భీమిని మండల పశువైద్యశాలలో వైద్యాధికారి, వెటర్నరీ అసిస్టెంట్, గోపాలమిత్ర ఉన్నారు.
భీమిని మండలంలో 12 గ్రామ పంచాయతీలు 24 గ్రామాల్లో పశువైద్య సేవలు అందించాల్సిన ఉన్నప్పటికీ ఉదయం 9 గంటలకు వచ్చి మధ్యాహ్నం 1 గంట వరకే డాక్టర్ అందుబాటులో ఉంటాడని, ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోతున్నాడని, ఫోన్ చేసి అడిగితే చిరాకు పడుతున్నాడని రైతులు చెబుతున్నారు. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందులు తీసుకోవాలని సమాధానం చెబుతున్నాడని పేర్కొంటున్నారు. మండల కేంద్రానికి చెందిన పాడి రైతులు ఆదివారం వ్యాధి సోకిన పశువులను దవాఖానకు తీసుకువెళ్లగా వైద్యశాలకు తాళం వేసి ఉందని తెలిపారు. మెడికల్ షాపుల్లో మందులు కొని పశువులకు వైద్యం చేయిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్య సేవలపై జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మండల కేంద్రాల్లోని పశువైద్యులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పశువులకు సీజనల్ వ్యాధులు సోకడంతో సకాలంలో వైద్యం అందడంలేదని తెలిపారు. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో భీమిని పశువైద్యుడు ఇష్టారీతిన విధులకు హాజరవుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశువైద్యాధికారి సమయ పాలన పాటించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఈ విషయంపై పశుసంవర్థక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ శంకర్‌ను ఫోన్లో సంప్రదించగా దవాఖాన పని వేళల్లో వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాల్సిందేనన్నారు. ఆదివారం డాక్టర్ అందుబాటులో లేకపోతే వెటర్నరీ అసిస్టెంట్ అందుబాటులో ఉండి వైద్యం అందించాలన్నారు. భీమిని దవాఖానలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పశువుల డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు ఇంటికి పోతాడో తెలియడం లేదు. మేకలకు రోగాలు వచ్చాయని దవా ఖానకు ఎప్పుడు వెళ్లినా మందులు ఇవ్వకుండా ప్రైవేట్ మెడికల్ షాపులో మందులు కొనుక్కోవాలని ఉచిత సలహా ఇస్తున్నాడు. చేసేదేం లేక ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందులు కొనుక్కొని ప్రైవేట్ వ్యక్తులతో చికిత్స చేయించాల్సి వస్తున్నది. దవాఖాన టైంలో కూడా సరిగ్గా రావడం లేదు. దీంతో రైతులం ఇబ్బంది పడుతు న్నాం. పశువైద్యాధికారి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
– కడెం భీమేశ్, గ్రామస్తుడు