మంచిర్యాలటౌన్/హాజీపూర్, సెప్టెంబర్ 16 : మంచిర్యాల వద్ద గోదావరి నది నిండుగా ప్రవహిస్తున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా, ఎల్లంపల్లిలోకి వదులుతున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఎస్సారెస్పీ నుంచి 232128 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 15008 క్యూసెక్కులు, క్యాచ్మెంట్ ద్వారా 175508 క్యూసెక్కుల వరద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరింది.
ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ 300 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టులోని 62 గేట్లలో.. 38 గేట్లు ఎత్తి 391362 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. మధ్యాహ్నం 12 గంటలకు 449332 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 410721 క్యూసెక్కులు కిందికి వదిలారు. మధ్యాహ్నం రెండు గంటలకు 472095 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 448957 క్యూసెక్కులను వదిలారు.
మూడు గంటలకు 469864 కూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 493003 క్యూసెక్కులు దిగువకు, నాలుగు గంటలకు 460976 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 491865 కూసెక్కుల నీటిని వదిలారు. మరోవైపు మంచిర్యాలకు ఎగువన ఉన్న మందమర్రి, కాసిపేట, తిర్యాణి, నెన్నెల మండలాల్లో కురిసిన వర్షాలకు రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మంచిర్యాల వద్ద రంగంపేట కాజ్వే పైనుంచి పొంగి ప్రవహిస్తోంది.
ఎల్లంపల్లి నుంచి మరింత నీటిని వదిలితే.. రాళ్లవాగు ఉధృతి పెరిగితే మంచిర్యాలలోని లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశాలుంటాయి. కాగా, వరద పరిస్థితులను కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల తహసీల్దార్ రఫతుల్లాతో కలిసి పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.