బెల్లంపల్లి, జూలై 1 : బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ మార్కెట్లో షట్టర్లు కేటాయించిన తీరు రోజు రోజుకూ వివాదాస్పదమవుతున్నది. ఏప్రిల్ 15న కలెక్టర్ కుమార్‌దీపక్ సమక్షంలో లాటరీ తీసిన ఓ వీడియో.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది. ఓ వ్యక్తి పేరును లాటరీలో దొంగచాటున తీసినట్లున్న వీడియోను బీజేపీ నాయకులు మంగళవారం విడుదల చేసి సోషల్ మీడియాలో పెట్టడం చర్చనీయాంశమవుతున్నది. ఆ వీడియోలో మున్సిపల్ బిల్ కలెక్టర్ విజయ్ జేబులో నుంచి ఓ పేరున్న చీటీని తీసి ఇచ్చాడని, ఆ పేరు తోకల మౌనిక వైఫ్ ఆఫ్ కొమ్ము సురేశ్దని ఆరోపించారు. షట్టర్ల కేటాయింపులో అనర్హులను చేర్చారనేది వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే అర్హుల జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే పలు ఫిర్యాదులు
ఏప్రిల్ 15న షట్టర్ల కేటాయింపులో భాగంగా నిర్వహించిన లాటరీ పద్ధతితో భారీగా అవినీతి జరిగినట్లు గత నెల 13న బ్లాక్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, నాయకులు ఆనంద్, పడాల సుదర్శన్, ఖలీల్ బేగ్, అక్బర్ ఖాన్, స్వామి, మనోహర్,శ్రీనాథ్, ఎండీ జలీల్ అప్పటి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. లాటరీ సమయంలో వెనుక వైపు నుంచి దొంగ చీటీలతో కూరగాయాల వ్యాపారానికి సంబంధం లేని వారి పేర్లను డ్రా పద్ధతిన అక్రమంగా షట్టర్లు కేటాయించారని అందులో పేర్కొన్నారు. మార్కెట్లోని 31 దుకాణాల్లో కొన్నింటిని అనర్హులకు కేటాయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల పలువురు కలెక్టర్ కుమార్‌దీపక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావును కలిసివ వినతిపత్రాలు కూడా సమర్పించారు. లాటరీ పద్ధతిలో నిర్వహించిన ప్రక్రియలో జరిగిన అవకతవకలపై తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని మున్సిపల్ కమిషనర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, అవకతవకలపై గత నెల 19న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నాయకత్వంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన విషయం విదితమే. కాగా, ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్‌ను వివరణ కోరగా.. సదరు బిల్ కలెక్టర్ విజయ్, ఇతర అధికారులతో విచారణ జరిపించి అక్రమాలకు జరిగినట్లు తేలితే వారిపై తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు.