రైతన్నల కల్పతరువు..పెద్దపేట చెకువు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పెద్దపేట చెరువు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. చెరువు నీటితో వానకాలంతోపాటు యాసంగిలోనూ రైతన్నలు పంటలు సాగు చేస్తున్నారు. వరి, మక్కతోపాటు ఇతర ఆరుతడి పంటలు పండిస్తూ ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు.
- మిషన్ కాకతీయతో మారిన రూపురేఖలు
- యాసంగిలోనూ 400 ఎకరాలకు సాగు నీరు
- 300 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పెద్దపేట చెరువు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. చెరువు నీటితో వానకాలంతోపాటు యాసంగిలోనూ రైతన్నలు పంటలు సాగు చేస్తున్నారు. వరి, మక్కతోపాటు ఇతర ఆరుతడి పంటలు పండిస్తూ ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. మండు వేసవిలో కూడా చెరువు కింద వ్యవసాయ బావుల్లో నిండా నీరు, ఎక్కడ చూసినా పచ్చని పంటలతో ఈ ప్రాంతం విరాజిల్లుతోంది. ఎండాకాలంలో కూడా బావులు నిండుగా నీటితో కళకళలాడుతాయి.
– దండేపల్లి, డిసెంబర్ 17
దండేపల్లి, డిసెంబర్17 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు చెరువులపై దృష్టి సారించకపోవడంతో పెద్దపేట చెరువు ఆయకట్టు క్రమంగా తగ్గుతూ వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ కాకతీయతో చెరువు రూపురేఖలు మారిపోయాయి. మొదటి విడుతలో(2015) భాగంగా రూ.34 లక్షలతో పూడిక తీసి కట్ట బలోపేతం, పొలాలకు వెళ్లే కాలువలకు మరమ్మతులు చేశారు. రెండో విడుతలో తూములు శిథిలావస్థకు చేరుకోగా వాటి స్థానంలో కొత్తవి నిర్మించారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఆయకట్టు పెరిగింది. మూడో విడుతలో రూ.8 లక్షలతో కట్ట బలోపేతం చేశారు. దీంతో చెరువు దశ తిరిగింది. చెరువుల్లో జలకళ ఉట్టి పడుతుండడంతో ఉన్న బావుల్లో నిండా నీరు ఉంటుం ది. ఈ బావులకు మోటర్లు అమర్చుకొని యాసంగి వరి, మక్క పండిస్తున్నారు. ఖరీఫ్‌లో ఏ మాత్రం తీసిపోకుండా యాసంగిలో సాగు చేస్తున్నారు.
మత్స్యకార కుటుంబాలకు ఉపాధి
పెద్దపేట చెరువు వ్యవసాయ అవసరాలకే కాక అనుబంధ రంగాలైన మత్స్య పరిశ్రమకు ప్రధాన ఆదరువుగా నిలుస్తోంది. చెరువుల్లో జలసిరి ఉంటేనే చేపల పెంపకానికి అవకాశం ఉంటోంది. మంచిర్యాల జిల్లాలోనే పెద్ద చెరువుల్లో ఒకటైన పెద్దపేట చెరువుపై ఆధారపడి 250 నుంచి 300 మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ చెరువులో ప్రతి యేటా రూ.10 లక్షల విలువైన చేపలు పడుతున్నారు. మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ లాంటి పెద్ద మార్కెట్‌కు తరలించి ఆర్థికంగా జీవనోపాధి పొందుతున్నారు. సంప్రదాయ రకాలైన కొర్రమీన, మట్ట, జెల్ల, చందమామ, పరక, పచ్చిరొయ్య విస్తృతంగా పండిస్తున్నారు. మళ్లీ పూర్వవైభవం వచ్చిందని మత్స్యకారులు సంబుర పడుతున్నారు.
సాగునీటికి ఇబ్బంది లేదు..
మాది లక్ష్మీకాంతాపూర్ గ్రామం. నాకు పెద్దపేట శివారులో ఎకరం పొలం ఉంది. నేను ఈసారి వరి వేశా. చెరువు కిందనే పొలం ఉండడంతో ఏనాడు సాగు నీటి కోసం ఇబ్బంది పడలేదు. గతంలో చుట్టూ పక్కల గ్రామాల్లో నీరు లేక పొలాలు ఎండిన రోజుల్లోనూ మేము పంటలు పండించుకుంటున్నాం. సర్కారు మిషన్ కాకతీయతో చెరువును బాగు చేసింది. చెరువు మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటుంది. యేటా ఈ చెరువుతో రెండు పంటలు పండించుకుంటున్నాం.
– బాదినేని శంకరయ్య, రైతు, లక్ష్మీకాంతాపూర్, దండేపల్లి మండలం
రెండు పంటలు వేస్తున్నా..
మాది పెద్దపేట గ్రామం. చెరువు ఆయకట్టు కింద నాలుగెకరాల పొలం ఉంది. యాసంగిలో నాలుగెకరాల్లో మక్క సాగు చేసిన. చెరువు కిందనే పొలం ఉండడంతో సాగు నీటికి ఇబ్బంది లేకుండా సాగు చేసుకుంటున్న. తెలంగాణ సర్కారు హయాంలోనే చెరువు బాగైంది. ఈ చెరువుతోనే మా కుటుంబం సంతోషంగా ఉంది. రెండు పంటలు పండించుకుంటున్నా.
– ఆగిడి తిరుపతి, రైతు, పెద్దపేట.
బావిలో నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి..
మాది లక్ష్మీకాంతాపూర్ గ్రామం. నాకు పెద్దపేట శివారులో మూడెకరాల పొలం ఉంది. ఇప్పుడు ఒక ఎకరం వరి, ఎకరం పత్తి, ఎకరం మక్క సాగు చేస్తున్నా. చెరువు చేయబట్టి బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉంటున్నయ్. అప్పటి సర్కారు రైతుల కొరకు ఆలోచించి చెరువు బాగు చేసింది. చెరువుతోని పంచాయతీకి ఆదాయం వచ్చుడే కాక రైతుల జీవితాల్లో మార్పు తెచ్చింది. రంది లేకుండా రెండు పంటలు పండించుకుంటున్నా.
– పసర్తి తిరుపతి, రైతు, లక్ష్మీకాంతాపూర్, దండేపల్లి మండలం.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

