కార్పొరేట్ సామ్రాజ్యం… సామర్థ్యాలు, నైపుణ్యాలు… ఇక్కడ ఎంట్రీపాస్‌లు. టార్గెట్లు, డెడ్లైన్లు… రోజు వారీ పఠన మంత్రాలు. అనారోగ్యం, అకాల మరణం… నిష్క్రమణ మార్గాలు! అందరికీ కాకపోయినా చాలామంది విషయంలో ఇది అచ్చంగా నిజం. ఒకసారి ఈ పద్మవ్యూహంలోకి వెళ్లాక వెనక్కి రావడం కష్టం. నెగ్గుకురావడం ఇంకా కష్టం. చేతకాదంటే కుదరదు. చేతులెత్తేసే వీలుండదు. పాపం, అదే ఒత్తిడి ఇటీవల 26 ఏండ్ల అన్నా సెబాస్టియన్ అనే చార్టెడ్ అకౌంటెంట్ ప్రాణం తీసింది. ఉద్యోగంలో చేరిన నాలుగు నెలల్లోనే కన్నుమూసిన అన్నా పరిస్థితిని తెలుపుతూ ఆమె తల్లి రాసిన లేఖ అలాంటి వృత్తుల్లో ఉన్న చాలామంది జీవితాల గురించి ప్రపంచం కండ్లకు కట్టింది. ఆ డెడ్‌లైన్ మీరూ దాటుతున్నారా… ఓసారి పరీక్షించుకోండి!
అందరిలాగే తన కూతురూ ఎన్నో కలలు, ఆశలతో ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టిందని అన్నా తల్లి అనిత రాసుకొచ్చారు. తను పాఠశాలలో ఫస్టు. కాలేజీలో ఫస్టు. అత్యంత కఠినమైన చార్టెడ్ అకౌంటెన్సీని చిన్న వయసులోనే పూర్తిచేసింది. ఆమెకు సవాళ్లను స్వీకరించడం తొలి నుంచీ అలవాటు. గబుక్కున ఏ విషయాన్నీ తన చేతకాదు అని వదిలేయదు. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడూ అంతే. తనకు ఇచ్చిన పనులను పూర్తి చేయడానికి చాలా తాపత్రయ పడేది. కానీ, ఆమె చేరిన సంస్థ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. చురుకైన అమ్మాయి కనుక మరింత పని చెప్పే ప్రయత్నం చేసింది. చిట్ట చివరికి ఆమెకు తినడానికి, నిద్ర పోవడానికి కూడా సమయం లేని పరిస్థితి. రాత్రి పని చెప్పి తెల్లవారి డెడ్‌లైన్ ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయని ఆమె తల్లి ఈ లేఖలో చెప్పుకొచ్చింది. అదెలా సాధ్యమంటే రాత్రిపూట కూడా పనిచేయవచ్చనీ, తామూ అలాగే చేస్తున్నామని తన బాస్ అన్నారనీ ఆమె ఉటంకించింది. అన్యాయంగా అనిపించినా సరే, ఈ సంఘటన బయటి ప్రపంచపు అసలైన స్వభావానికి అద్దం పడుతున్నది. అయితే, ఈ సందర్భం నుంచి వృత్తి ఉద్యోగాల్లో ఉన్న ప్రతి మహిళా నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయి. మనం ఈ కోణంలో ఆలోచిస్తే ఎక్కువ కాలం వృత్తుల్లో రాణించగలం. ఆరోగ్యాన్నీ కొద్దో గొప్పో కాపాడుకోగలం.
ప్రతి మనిషికీ కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. వాటికి సాన పెట్టడంలో, మరింత మెరుగు పరచడంలో ఉద్యోగం కొద్దో గొప్పో సాయపడుతుంది. పరిమితమైన ఒత్తిడి మన శక్తి సామర్థ్యాలను రెట్టింపు చేస్తుంది కూడా. కానీ, ఒకానొక సందర్భంలో మనసు, శరీరం రెండూ మనల్ని హెచ్చరిస్తాయి. అప్పుడు తప్పకుండా ఆలోచించాలి. నిజంగా మనం చేయగలిగినంత పనే తలకెత్తుకుంటున్నామా… అని సమీక్షించుకోవాలి. దానికి తగ్గట్టు తక్షణ చర్యలూ తీసుకోవాలి.
మనం ధైర్యంగా ఉండాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన బలాలు, బలహీనతలు గుర్తెరగాలి. మనకంటూ ఒక వర్కింగ్ ైస్టెల్ ఉండాలి. ఒక పని మన దగ్గరికి వచ్చినప్పుడు ఒత్తిడి లేని చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకుని దాన్ని నెమ్మదిగా సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఒక టైం టేబుల్ లేదా ఒక పద్ధతి వర్కవుట్ కాకపోతే మరోటి ప్రయత్నించాలి. అలా కూడా అవ్వని పక్షంలో అది తలకు మించిన భారం అని గుర్తించాలి. మీ పై అధికారితో మాట్లాడాలి.
మూడు గంటల సినిమాకు మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది. పది అంకెల మొబైల్ నంబర్కీ మధ్యలో స్పేస్ ఉంటుంది. బుర్ర చురుగ్గా పనిచేయాలంటే, చేస్తున్న పని మీద ఏకాగ్రత ఉండాలంటే తప్పకుండా బ్రేక్ అవసరం. ఇది కూడా పనిలో భాగమే. కాబట్టి తప్పకుండా పనికి మధ్య మధ్యలో విరామం ఇవ్వండి. దీర్ఘకాలం పాటు సాగే పనులైతే, ప్రాజెక్టు పూర్తయ్యాక ఏ విహారయాత్రకో వెళ్లండి. శరీరంతో పాటు మనసుకీ విశ్రాంతి అవసరం అని గుర్తించండి.
చాలా సందర్భాల్లో మనం ఉద్యోగం గురించి భయపడటానికి ఆర్థిక భద్రత ప్రధాన కారణంగా ఉంటుంది. ఇవాళ ఉద్యోగం పోతే, నెలాఖరుకు జీతం రాకపోతే… ఎలా అన్న ఆలోచన ఒత్తిడికి గురి చేస్తుంది. అలాంటప్పుడే మనం మన గురించి ఆలోచించడం మానేస్తాం. అలా కాకుండా, ఆరునెలలు జీవించడానికి సరిపడా డబ్బును అత్యవసర నిధి కింద ఎప్పుడూ ఉంచుకుంటే మనం కాస్త భరోసాగా ఉండగలం. అలాగని బంగారమంటి ఉద్యోగాన్ని కాలదన్నుకుంటామని కాదు. నిజంగా అవసరమైన పక్షంలో సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితిలో మాత్రం ఉంటాం.
మనకు పని అప్పజెపితే అది పూర్తయిపోయినట్టే అని మేనేజ్మెంట్ భావించాలి… చాలామంది సమర్థులైన ఉద్యోగులుగా పేరు తెచ్చుకోవాలని ఆరాటపడే వాళ్ల ఆలోచన ఇది. నిజమే. మనకు పనిచెబితే అయి తీరాల్సిందే! అలా అని పని మీద పని అప్పగిస్తుంటే… పరిగెత్తి భారం దించేసుకున్న మనిషికి అంతే వేగంగా మరో భారం నెత్తిన పెడుతుంటే… తప్పకుండా గమనించాల్సిందే. ఒక వేళ వాళ్లు చెప్పే పనులు పూర్తి చేయలేమన్న భావన మనకు వచ్చిందంటే… తప్పకుండా అది అవ్వదని చెప్పేయాలి. నో చెప్పడం కొన్నిసార్లు అత్యవసరం అన్న విషయాన్ని నమ్మాలి. అలా చేయని పక్షంలో మనం మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సిందే. అలాగని అనుకున్నంత గొప్పగా అవుట్‌పుట్ కూడా ఏమీ ఇవ్వలేం.
అమ్మో… డెడ్‌లైన్‌లోపు పని పూర్తి చేయకపోతే క్లయింట్ దగ్గర మాటపడాల్సి వస్తుంది. అనుకున్న సమయానికి ఈ టార్గెట్ పూర్తి చేయకపోతే ఉద్యోగం ఊడిపోతుంది… అనుకునే సందర్భాలు ప్రతి ఉద్యోగి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తాయి. కానీ పదేపదే అదే అదే అనుకోవాల్సి వస్తే మాత్రం… పరిస్థితిని సమీక్షించుకోవాల్సిందే! ఆరోగ్యం మీద, తద్వారా రోజువారీ జీవితం మీదా ఆ తాలూకు చీకటి ప్రభావం పడుతుంటే నిర్మొహమాటంగా ఉద్యోగానికి బై చెప్పే ప్రయత్నం చేయాల్సిందే! ఎదురైన ప్రతి పనీ పూర్తి చేయగలిగితేనే మనం గెలిచినట్టు, లేకపోతే ఓడిపోయినట్టు… అన్న భావనలు ఉండనక్కర్లేదు. అయినా మన బాగుకోసం మనం కొన్నిసార్లు ఓడిపోవడం తప్పేం కాదు! ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి!