అభినయంతో, అందచందాలతో ప్రేక్షకుల హృదయాలు గెలిచిన దీపికా పదుకోన్.. అభిమానులకు సినిమా కబుర్లే కాదు, ఒత్తిడిని జయించే సూత్రాలూ చెబుతున్నది. ఒకానొక దశలో తాను డిప్రెషన్‌కు గురైన విషయాన్ని బహిరంగంగానే ప్రకటించింది. ఆ సమయంలో అమ్మ లేకపోతే ఘోరం జరిగిపోయేదంటూ తన మనసు విప్పింది..
‘అదో నరకం. ఒత్తిడికి కారణమేమిటో కూడా తెలియకపోయేది. కారణం వెతికేకొద్దీ మరింత ఒత్తిడికి గురయ్యేదాన్ని. చేసేదేం లేక ఎక్కువసేపు నిద్రపోవడానికి ప్రయత్నించేదాన్ని. అయినా కళ్లు మూతపడితే ఒట్టు. హీరోయిన్గా మంచి పేరే ఉన్నా.. ఏదో వెలితి. అమ్మానాన్న బెంగళూరులో ఉండేవారు. ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్లు. ఆ సమయంలో మాత్రం చాలా చురుగ్గా ఉన్నట్టు నటించేదాన్ని. ఒకసారి నావల్ల కాలేదు. అమ్మ ముందు అమాంతం ఏడ్చేశాను. భయపడిపోయింది. కెరీర్ సమస్యా? బాయ్‌ఫ్రెండ్ సమస్యా? అని అడిగింది. ఏం చెప్పాలో అర్థంకాలేదు.
నా బాధకు కారణమేమిటో నాకే తెలియదు. ఆ సమయంలో దేవుడే అమ్మను నా దగ్గరికి పంపాడేమో. ఆ సంక్షోభంలో అమ్మ కనుక నా వెనుక లేకపోయి ఉంటే నా జీవితం అక్కడితోనే ముగిసిపోయేది’ అంటూ తల్లికి మనసారా కృతజ్ఞతలు చెప్పింది దీపిక. తనలా ఎవరూ డిప్రెషన్‌కు గురికావద్దనే.. ‘లివ్ లవ్ లాఫ్’ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది. ‘డిప్రెషన్ బాధితులకు తొలి వైద్యులు కుటుంబ సభ్యులే’ అంటున్నది దీపిక.