ఒక్క గొలుసు వేసుకుంటేనే మెడనిండా నగలు పెట్టుకున్నట్టు కనిపించేలా.. చూడగానే రాజసం ఉట్టిపడేలా.. ఆడవాళ్ల అందానికే కాదు, మగవాళ్ల ఠీవికీ సరిపడేలా.. వగైరా వగైరా లక్షణాలు కలిగిన ఆభరణం ఏదైనా ఉందా అంటే? అది ‘సాత్లడా’ మాత్రమే! ఈ గొలుసు ఇప్పుడు సెలెబ్రిటీల నుంచి సాధారణ జనం దాకా అందరికీ హాట్ ఫేవరేట్ అయ్యింది. శుభకార్యాల్లో అయితే సాత్లడా సందడి చేయాల్సిందే.
నయనతార తన పెండ్లిలో ఎరుపు చీర మీద సాత్లడా నగకు చోకర్ జోడించిన తీరు.. సోషల్ మీడియాలో సంచలనం అయ్యింది. నయన్ అందానికి ఎన్ని మార్కులు పడ్డాయో, ఆమెను రాణిలా చూపించిన సాత్లడా నగకు అంతకంటే ఎక్కువ ఓట్ల్లే పడ్డాయి. ఈ ఏడు వరుసల నగ ఇప్పటిది కాదు. నిజాం జమానా నాటిది. అప్పటి పాలకులు రాజసానికి చిహ్నంగా అరుదైన ముత్యాలు, కెంపులు, పచ్చలు, వజ్రాలు జోడించి ధరించేవారు. హైదరాబాద్ చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ధరించిన 465 బస్రా ముత్యాలతో చేసిన సాత్లడా హారం నిజాముల నగల్లో ప్రత్యేకమైంది. రాణులు సైతం వారసత్వ సంపదగా వీటిని పెట్టుకునేవారు.
పటియాలాను ఏలిన రాజా భూపిందర్ సింగ్ ధరించిన అత్యంత ఖరీదైన నగ కూడా ఈ తరహాదే. అయితే, ఇటీవల ఆభరణ తయారీ సంస్థలు.. వీటిని రీ డిజైన్ చేస్తున్నాయి. స్త్రీపురుషులిద్దరూ ధరించ గలిగేలా రూపొందిస్తున్నాయి.
సెలెబ్రిటీలు కూడా ప్రత్యేక వేడుకల కోసం ఏరికోరి ఎంచుకుంటున్నారు. దీంతో సాత్లడా క్రేజ్ పెరిగింది. దీపికా పదుకొనే తన మెహిందీ ఫంక్షన్లో సాత్లడాతోనే మెరిసి పోయింది. సాత్ అంటే.. ఏడు, లడా అంటే… వరుసలు. ‘ఏడు వరుసల నగ’ అని అర్థం.
అన్నట్టు ఐదు వరుసల్లో పాంచ్లడా,మూడు వరుసల్లో తీన్లడా కూడావస్తున్నాయి. వీటిని ఎక్కువగా ముత్యాలతోనే రూపొందిస్తున్నారు. బంగారు పూత పూసిన వెండి, గిల్టు నగలూ లభిస్తున్నాయి.
బంగారంలో అయితే ఐదు వరుసలనగల తయారీకి మూడున్నర తులాలు చాలు. ఇంకేం, ఈసారి మీ ఇంట్లో జరిగే ఫంక్షన్కు సాత్లడాతో మెరిసిపోండి!