గిరికోనలో సందడి మొదలైంది. డప్పుల మోతతో అడవితల్లి ప్రతిధ్వనిస్తున్నది. దీపావళి సందర్భంగా ఆదివాసీ గూడెంలో దండారి వేడుకలు సంప్రదాయ బద్ధంగా సాగుతాయి. గుస్సాడీ నృత్యాలు, కోలాటాలు, కోలాహలాలతో గూడాలన్నీ సందడిగా మారాయి. దీపావళికి వారం ముందు నుంచే దండారి సందడి మొదలవుతుంది. పండుగ తర్వాత కోలాబొడితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇందులో భాగంగా తమ ఆరాధ్యదైవం అయిన ఏత్మాసుర్ను భక్తితో కొలుస్తారు. ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించే దండారి వేడుకలో గుస్సాడీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఒళ్లంతా బూడిద రాసుకొని, కాళ్లకు గజ్జెలు కట్టుకొని, జంతు చర్మం భుజాన వేసుకొని, నెమలి పింఛాలు ధరించి వాద్యఘోషకు అనుగుణంగా చేసే నృత్యం చూడముచ్చటగా ఉంటుంది. లయాత్మకంగా కదలాడుతూ, భక్తిపారవశ్యంలో హావభావాలు పలికిస్తూ భక్తులను అలరిస్తారు కళాకారులు. ఉత్సవాల్లో భాగంగా ఒక గూడెం నుంచి మరొక గూడానికి వెళ్తూ బంధుత్వాలు కలుపుకొనే ప్రయత్నం చేస్తారు ఆదివాసీలు. అనుబంధాలు పెంచుకోవడానికి దండారి పండుగను ఆలంబనగా చేసుకుంటారు.