హై వాటర్ (వెబ్ సిరీస్- ఇంగ్లిష్)
నెట్ఫ్లిక్స్: అక్టోబర్ 5
దర్శకత్వం: జాన్ హోలోబెక్
ప్రకృతి విపత్తులకు ప్రధాన కారణం మనిషి స్వార్థమే! పర్యావరణానికి హాని తలపెడితే ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తుతాయో తెలియజేస్తూ ‘హై వాటర్’ సిరీస్ను రూపొందించారు. మానవీయ, రాజకీయ కోణంలో సాగే ఎపిసోడ్లు ఆసక్తి రేకెత్తిస్తాయి. ఈ కథకు 1997లో పోలాండ్తోపాటు జర్మనీలోని కొన్ని నగరాల్ని ముంచెత్తిన ఆకస్మిక వరదలను నేపథ్యంగా తీసుకున్నారు. ఇంతటి విపత్తులోనూ రాజకీయ, ప్రభుత్వ యంత్రాంగాల నిష్క్రియాపరత్వం, ప్రజల్ని ఎలాగైనా రక్షించాలని అనుక్షణం తపించే మహిళా హైడ్రాలజిస్ట్ మధ్య కథంతా నడుస్తుంది. 1997లో పోప్జాన్ పాల్ -2 పోలాండ్ నగరాన్ని సందర్శిస్తున్నారనే ప్రకటనతో ఈ సిరీస్ మొదలవుతుంది.
అదే సమయంలో నగరాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. వీటిని అధికార యంత్రాంగం ఏమాత్రం ఖాతరు చేయదు. ఇదే సమయంలో నగరాన్ని వరద బారి నుంచి రక్షించడానికి హైడ్రాలజిస్ట్ జాస్మినా ట్రెమర్ (ఆగ్నేస్కా జులేస్కా) రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో చోటు చేసుకునే పరిణామాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. అధికార యంత్రాంగం వ్యవహరించే తీరు, ప్రజల్లో గూడుకట్టుకున్న నైరాశ్యం, విపత్తులో కూడా కొందరు వ్యక్తుల స్వార్థచింతన ఇలా రకరకాల పార్శాలను ఇందులో స్పృశించారు. అదే సమయంలో ప్రకృతిపట్ల బాధ్యతతో వ్యవహరించాలనే సందేశాన్నిచ్చారు నిర్దేశకులు. వరదల నేపథ్యంలో వచ్చిన ‘హై వాటర్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది.