‘బావర్చీ’ సినిమా సెట్‌కు ఓ పొడగాటి బక్కపల్చని వ్యక్తి వచ్చాడు. అక్కడే ఉన్న సినిమా హీరో.. వచ్చిన వ్యక్తిని చూసీ చూడనట్టు వ్యవహరించాడు.కనీసం కూర్చోమని అనలేదు. ఈ వ్యవహారం ఆ పొడగరి ఎత్తు తగ్గించలేదు.కానీ, అక్కడే ఉన్న ఓ నటి మాత్రం అగ్గిమీద గుగ్గిలం అయింది. ‘మీరు చులకనగా చూసిన ఈ వ్యక్తి దేశం గర్వించదగ్గ నటుడు అవుతాడు. సినిమా ఇండస్ట్రీని శాసిస్తాడు’ అని తీవ్రంగా స్పందించింది. ఆమె ఆ మాటలు ఏ ముహూర్తాన అన్నదో కానీ, అవి శిలాక్షరాలు అయ్యాయి.
కొన్నాళ్లకు.. ముంబయిలోని ప్రముఖ హోటల్లో ఓ సినీవేడుక. ఆ హీరో అక్కడే ఉన్నాడు. సినీజనాలంతా ఆయన చుట్టూ మూగారు. కాసేపటికి అదే పొడవాటి వ్యక్తి అక్కడికి వచ్చాడు. అప్పటి వరకు ఆ హీరో చుట్టూ చేరి కాకాపడుతున్న వారంతా.. ఆ నిలువెత్తు మనిషి చుట్టూ గుమిగూడి ఫొటోగ్రాఫ్లకు ఎగబడ్డారు. రోజులు గడిచే కొద్దీ ఆ పొడవాటి మనిషి కీర్తి ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగింది. ఆయన మరెవరో కాదు ఎనిమిది పదుల వయసులోనూ ఖాళీలేకుండా కాల్షీట్లు ఇస్తున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఇంతకీ ఆనాడు ‘ఆయన ఇండస్ట్రీని శాసిస్తాడు’అని అన్నది మరెవరో కాదు. జయా బాదురి. ఆ తర్వాత జయా బచ్చన్ అయింది.
ఇటీవల 80వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకొన్న బిగ్ బీ ప్రస్థానంలో ఎత్తుపల్లాలు కోకొల్లలు. ఛీత్కారాల నుంచి సత్కారాల వరకు అన్నీ చూశాడు. ఎగిసిన చోటే పడ్డాడు. పడిన చోటే మళ్లీ లేచాడు. ‘నమక్ హలాల్’ సినిమాలోని ‘బుజుర్గోఁనే ఫర్మాయా కీ పైరోఁపే అప్నే ఖడే హోకే దిఖ్లావో’ (నీ కాళ్ల మీద నువ్వు నిలబడి చూపించమని పెద్దలు అన్నారు) పాట అమితాబ్‌కు సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో వర్తిస్తుంది. డక్కాముక్కీలు తిని హీరోగా ఒక్కసారి నిలబడిన తర్వాత.. ‘అరె దీవాఁనో ముఝె పెహచానో’ అనాల్సిన అవసరం లేకుండా పోయింది. అమితాబ్ కటౌట్ కనిపిస్తే చాలు కాసులు వర్షించాయి. ఆయన అలా ఎడమ చేత్తో కాస్త వంకరగా తుపాకీ పట్టుకుని స్టయిలిష్‌గా నిలబడిన పోస్టర్ గోడెక్కితే చాలు థియేటర్లో టికెట్లు తెగ తెగేవి.
1969లో మొదలైన అమితాబ్ ప్రయాణం.. 70వ దశకంలో జోరందుకుంది. తను నటించిన మొదటి చిత్రం ‘సాత్ హిందుస్థానీ’తో ‘బెస్ట్ న్యూకమర్’ అవార్డు అందుకున్నాడు. మూడో చిత్రం ‘ఆనంద్’తో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ పురస్కారం పొందాడు. అప్పటి నుంచి అవార్డులు, రివార్డులు అమితాబ్‌కు పరిపాటిగా మారిపోయాయి. 1973లో విడుదలైన ‘జంజీర్’ కలెక్షన్లు వసూలు చేయడంలో అమితాబ్ కెపాసిటీని బాక్సాఫీస్‌కు పరిచయం చేసింది. ‘దీవార్’, ‘షోలే’, ‘డాన్’ ఇలా వరుస విజయాలు ఆయన ఖాతాలో జమయ్యాయి. దాదాపు పాతికేండ్లపాటు బాలీవుడ్లో తిరుగులేని స్టార్‌గా అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ ఈ తరం పెద్ద హీరోలకు స్ఫూర్తిగా నిలిచాడు.
90వ దశకం ద్వితీయార్థంలో అమితాబ్ ప్రభ మసకబారుతూ వచ్చింది. క్రమంగా సినిమాలు తగ్గాయి. విడుదలైన సినిమాలూ చాలావరకు పరాజయం చవిచూశాయి. ‘అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్’ ఆర్థికంగా నట్టేట ముంచింది. 1996 ‘మిస్ వరల్డ్’ అందాలపోటీల నిర్వహణ మరింత దెబ్బతీసింది. దీనికితోడూ బోఫోర్స్ కుంభకోణంలో ఆయన పేరు బయటికి రావడంతో మానసికంగానూ కుదేలయ్యాడు. అయితే, కుంభకోణంలో తన ప్రమేయం లేదని న్యాయస్థానం క్లీన్చిట్ ఇవ్వడంతో ఊరటపొందాడు. దాదాపు వెండి‘తెర’మరుగైన అమితాబ్ బుల్లితెరను నమ్ముకున్నాడు. అనుకోని అవకాశాన్ని అద్భుతంగా అందుకున్నాడు. 2000 సంవత్సరంలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ గేమ్ షోతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఆనాటి నుంచి ఆయన మళ్లీ బిజీ అయ్యాడు. కెరీర్ ఉచ్ఛదశలో ఉన్నప్పుడు ఎలాగైతే నిర్మాతలు కాల్షీట్ల కోసం వేచి చూశారో.. అలాగే ఎదురుచూసేంత బిజీ అయ్యాడు.
ద్వితీయ పర్వంలో అమితాబ్ అద్వితీయ నటుడని నిరూపించుకునే సినిమాలు ఎన్నో చేశాడు. ప్రయోగాత్మక చిత్రాలు, సినిమాను నడిపించే క్యారెక్టర్లు, కథను మలుపుతిప్పే పాత్రలు ఆయన తలుపుతట్టాయి. ‘సర్కార్’, ‘పా’, ‘రన్’, ‘పింక్’, ‘102 నాటౌట్’ ఇలా తన నటనా పటిమతో ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తున్నాడు. అమితాబ్ చేతిలో ఇప్పుడు అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ సీజన్ 14 కొనసాగుతున్నది. ‘జ్ఞాన్ జహాఁ సే మిలే బటోర్ లో, లేకిన్ పహలే టటోల్ లో’ కేబీసీ సీజన్ 14 ప్రోమోలో అమితాబ్ పలికిన మాటలివి. ‘జ్ఞానాన్ని ఎక్కడి నుంచైనా సేకరించండి. కానీ, ముందుగా పట్టుకోండి’ అని అర్థం. ఈ మాటలు ఆయనకు అతికినట్టు సరిపోతాయి. తనకు ఎదురైన ప్రతి సంఘటన నుంచి ఆయన ఎంతోకొంత నేర్చుకున్నాడు. అలా నేర్చుకున్న విషయాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దానిని పక్కాగా అమలుచేశాడు. అందుకే బిగ్ బీ.. ఇప్పటికీ, ఎప్పటికీ బిగ్ బీ ఓన్లీ!!