పడుకున్నప్పుడు మడమలపై భారం పడుతుంది. అలాగే మోకాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. పక్కకు తిరిగి పడుకుంటే భుజంపై భారం, మెడపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వెన్నుకూడా ఒత్తుకు పోతుంటుంది. ఈ ఒత్తిడి, భారం లేకుండా గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ కలిగించే సుఖమైన నిద్ర ఉందా? అని ఆలోచించేవాళ్లు జీరో గ్రావిటీ స్లీప్ గురించి ఆన్లైన్లో బాగా సెర్చిస్తున్నారు. ఇలా నిద్రపోతే నడుము నొప్పి, గురక తగ్గుతాయని, రక్త ప్రసరణ మెరుగవుతుందని, హాయిగా నిద్రపడుతుందని చర్చిస్తున్నారు.
నిజంగానే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? లేక ఇది కూడా సోషల్ మీడియా పుకార్లలో ఒకటిగా నిలుస్తుందా? అని కూడా చాలామంది సందేహిస్తున్నారు. అయితే వంపు తిరిగిన పడకపై నడుము వాల్చి, ఏటవాలు తలంపై తల ఆన్చి నిద్రపోతే.. శరీర భారం మొత్తం వెన్ను, మోకాళ్ల మీదే కాకుండా ఇతర భాగాలపైనా పడుతుంది. అందువల్ల శరీరానికి కాస్త హాయిగా ఉంటుంది.
అది మంచి నిద్రకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. మోకాళ్లు పాదాలకంటే కాస్త ఎత్తులో, రెండు కాళ్లూ దూరంగా ఉంటే కాళ్లు గుంజుతున్నట్టుగా బాధపడేవారికి ఉపశమనం ఉంటుందట. నిద్ర సమస్యలతో బాధపడేవారికి కొంత వరకు విముక్తి కలుగుతుందని చెబుతున్నారు. ఏదైనా ఇప్పటికిది చర్చ మాత్రమే. ఇలాంటి వాటిని సలహాలు లేకుండా గుడ్డిగా పాటించొద్దని కూడా వైద్యులు సలహాలిస్తున్నారు.