e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home జిందగీ సేవలో యువరాజు

సేవలో యువరాజు

లార్డ్స్‌ లో గంగూలీ చొక్కా విప్పేసి గిరగిరా తిప్పినా.. ధోని ప్రపంచ కప్‌ను ముద్దాడినా.. బ్రాడ్‌ బౌలింగ్‌ను ఉతికి ‘ఆరే’సినా.. ఆ ఘనత వహించిన ఒకే ఒక్కడు యువరాజ్‌. ముద్దుగా యువీ! క్రీడామైదానంలో చూపించిన స్ఫూర్తిని జీవిత సమరంలోనూ కొనసాగించాడు. క్యాన్సర్‌ మహమ్మారిని గెలిచాడు. జీవితాన్ని జయించిన ఈ దిగ్గజ ఆల్‌రౌండర్‌ మానవత్వంలోనూ తనకు సాటి లేదని నిరూపిస్తున్నాడు. ‘యువీకెన్‌’ ఫౌండేషన్‌ ద్వారా నలుగురికీ అండగా నిలుస్తున్నాడు. మౌలిక వసతుల్లేక చిక్కిపోయిన ప్రజావైద్యానికి ‘మిషన్‌ థౌజెండ్‌ బెడ్స్‌’ పేరిట చికిత్స ప్రారంభించాడు. ఇందులో భాగంగా రూ.2.50 కోట్ల విలువ చేసే ఐసీయూ బెడ్లు, వైద్య పరికరాలను నిజామాబాద్‌ ప్రభుత్వ దవాఖానకు వితరణ చేసి ‘భళా యువీ’ అనిపించుకున్నాడు.

భారత మేటి క్రికెటర్లలో యువీ ఒకడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఆటలో తనకు పట్టులేని కోణం లేదు. 2011 ప్రపంచ కప్‌ను సాధించడంలో తనదైన పాత్ర పోషించాడు. ఆ ఆనందంలో ఉండగానే, క్యాన్సర్‌ సోకింది. ఆ వ్యాధితో ఆత్మవిశ్వాసంతో పోరాడాడు. మహమ్మారిని జయించి పరిపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. రెండో జీవితం మొదలుపెట్టాడు. ఇది తన కోసం కాదు. తనలా క్యాన్సర్‌తో బాధపడుతున్నవారి కోసం. దేశ ప్రజల కోసం. 2012లో తన పేరిట ‘యువీకెన్‌’ ఫౌండేషన్‌ను స్థాపించాడు. తను జయించిన క్యాన్సర్‌ మహమ్మారిపై మరోసారి యుద్ధాన్ని ప్రకటించాడు. తొమ్మిదేండ్లుగా, ఎందరో అభాగ్యులు తనలానే క్యాన్సర్‌ వ్యాధి నుంచి బయటపడేందుకు అండగా నిలుస్తున్నాడు. తన సంస్థ ద్వారా 30 వేల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించాడు. 1.50 లక్షల మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేయించాడు. యాంటీ టొబాకో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాడు. రిహాబిలిటేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా దాదాపు 24వేల మందితో పొగ మాన్పించగలిగాడు. 2019 నుంచీ క్యాన్సర్‌తో బాధపడుతున్న 30 మందికి చికిత్స కోసం సాయం అందించాడు. 150 మంది క్యాన్సర్‌ బాధిత చిన్నారులకు ఉపకార వేతనం ఇస్తున్నాడు. గండం నుంచి బయటపడిన నాటి నుంచీ ఎందరినో గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు యువీ.

- Advertisement -

నిజామాబాద్‌ నుంచి మొదలు
కరోనా పరిస్థితులను చూసి యువీ చలించిపోయాడు. బెడ్స్‌ లభించక బాధితులు అల్లాడటం అతడ్ని కలచివేసింది. ఈ తరుణంలో తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పంతో ‘మిషన్‌ థౌజెండ్‌ బెడ్స్‌’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టాడు. నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి నుంచి ఈ సేవను ప్రారంభించాడు. ఇప్పటి వరకు దవాఖానలోని మూడు ఐసీయూల్లో 144 బెడ్స్‌, 75 వెంటిలేటర్లు అందుబాటులో ఉండేవి. ‘యువీకెన్‌’ సంస్థ ద్వారా అత్యాధునిక మానిటర్లు ఉన్న 120 ఐసీయూ పడకలు సమకూరాయి. 18 అత్యాధునిక వెంటిలేటర్లు కూడా అందజేశాడు. పిల్లలకు వాడే వెంటిలేటర్లు ఇప్పటి వరకు ఆసుపత్రిలో అందుబాటులో లేవు. యువీ దాతృత్వంతో ఆ సమస్య తొలగిపోయింది. 16 సీపాప్‌, బైపాప్‌ పరికరాలను సైతం అందజేసిందీ సంస్థ. 100 ఆక్సిజన్‌ సిలిండర్లు కూడా సమకూర్చడం విశేషం. తన ఆటతో యువతకు ప్రోత్సాహం ఇచ్చిన యువరాజ్‌ సేవా పథంలోనూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.

… జూపల్లి రమేష్‌రావు, నిజామాబాద్‌

దేశ సేవలో..
“వృత్తిగతంగా, వ్యక్తిగతంగా క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ నేటికీ దేశసేవలోనే తరిస్తున్నారు. క్రికెటర్‌గా దేశానికి గొప్ప సేవ చేశారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ప్రజాసేవలో కొనసాగుతున్నారు. యువీకెన్‌ సంస్థ ద్వారా తెలంగాణలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. దేశవ్యాప్తంగా చేపట్టనున్న ‘మిషన్‌ థౌజెండ్‌ బెడ్స్‌’ కార్యక్రమాన్ని నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ప్రారంభించడం పట్ల యువరాజ్‌సింగ్‌ చాలా సంతోషం వ్యక్తం చేశారు. తన వైపు నుంచి మరింత సహకారం అందిస్తానని చెప్పారు.”

దొడ్డి సృజన్‌
యువీకెన్‌ ఫౌండేషన్‌ స్టార్‌ క్యాంపెయినర్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement