మాతృత్వానికి ప్రతినిధులు.. అంగన్వాడి అమ్మలు.కరోనాతో పోరాడి గెలిచిన యోధలు.. మన ఊరి ఆశ కార్యకర్తలు. ఖాకీడ్రస్లోని కరుణామూర్తులు..పోలీసు ఉద్యోగులు. పల్లె రూపం మార్చిన కార్యసాధకులు.. ఆదర్శ సర్పంచ్‌లు. సంప్రదాయ సారథులు.. జానపద కళాకారిణులు. అక్షరాల నెచ్చెలులు.. పాత్రికేయులు. చదువులమ్మ ముద్దుబిడ్డలు.. సాహితీవేత్తలు.సరిగమల సిరిమంతులు.. గాయనీమణులు. బొమ్మలు గీసి, ప్రాణంపోసే.. చిత్రకారిణులు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా.. భిన్న రంగాలలో అపార ప్రతిభ కనబరుస్తున్న స్త్రీ మూర్తులను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘ఉమెన్ అవార్డ్స్-2023’ పురస్కారాలతో.. ఘనంగా సత్కరించింది తెలంగాణ ప్రభుత్వం. హనుమకొండ వేదికగా జరిగిన ఆ వేడుక పట్టుచీరల రెపరెపలతో, మట్టిగాజుల గలగలలతో.. పుట్టింటి సంబురాన్ని తలపించింది. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు ‘జిందగీ’తో తమ మనోభావాలు పంచుకున్నారు.
నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ పరిధిలోని పీహెచ్సీలో ఆశ కార్యకర్తగా పనిచేస్తున్నా. కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితుల్లో ఇంటింటికి తిరిగి కరోనా సేవలు అందించాను. అందులోనూ గర్భిణుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాను. నా వంతు ధైర్యం చెప్పాను.
-మండల కృష్ణవేణి, ఆశ వర్కర్
మాది మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా. కీసర మండలం పీహెచ్సీ సబ్సెంటర్లో ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. మాతా శిశు సంరక్షణ నా బాధ్యత. జాతీయ అవార్డు కూడా అందుకున్నా. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు సేవ చేయడం నా అదృష్టంగా భావించాను. ఎంతో సంతృప్తినిచ్చిన అనుభవం ఇది.
-తుంగ ఇందిర, ఏఎన్ఎం
దట్టమైన అడవిని దాటి.. అవతలివైపు చేరుకొని ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన గుత్తికోయ బాలలకు సేవలు అందించాను. గిరిజన గ్రామమైన గుట్టుమల్లా పంచాయతీలో అంగన్వాడి టీచర్‌గా పనిచేస్తున్నా. రక్తదాతగానూ ప్రశంసా పురస్కారం అందుకున్నాను.
-బానోత్ జ్యోతి, అంగన్వాడి టీచర్
సెంటర్ కోఆర్డినేటర్‌గా, కౌన్సెలర్‌గా.. భరోసా, సఖి కేంద్రల్లో పనిచేశాను. తరుణి సంస్థ నేతృత్వంలో యుక ్తవయసు బాలికల నైపుణ్యాలను మెరుగుపరిచాను. కాలేజీలు, స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాను. యువత సన్మార్గంలో నడుస్తూ చదువుపై దృష్టి పెట్టేలా మార్గదర్శనం చేశాను. ఆ ప్రయత్నంలో వివిధ విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నా.
-గుండా రాజకుమారి, హైదరాబాద్
శాంతి నిలయం.. మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రం కార్యదర్శిగా దివ్యాంగబాల బాలికల సంక్షేమానికి కృషిచేస్తున్నా. అయినవారికి దూరమైన ఆ పిల్లలకు ప్రేమను పంచడం నా బాధ్యతగా భావిస్తున్నా. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు నీడనిస్తున్నా. తోడుగా నిలుస్తున్నా. ఖమ్మం జిల్లాలోని వివిధ గ్రామాల్లో పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిస్తున్నా. జీవన నైపుణ్యాలు బోధిస్తున్నా.
-ఆల్పి కిడాంజన్ సోషల్ సర్వీస్
ముదితల్ నేర్వగరాని విద్య కలదే.. అనే మాట పాతబడి పోయింది.ఇప్పుడు ఆమెకు ఎవరూ నేర్పాల్సిన పనిలేదు. తనే కష్టపడుతుంది. తనే మార్గం సిద్ధం చేసుకుంటుంది. అనుకున్నవిజయాన్నిసాధిస్తుంది.
ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్రా గ్రామ సర్పంచ్ హోదాలో ఆ పల్లె రూపురేఖలు మార్చేశాను. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా మహిళా అఛీవర్ అవార్డు అందుకోవడం గొప్ప అనుభూతి. ముఖ్యమంత్రి సహాయనిధికి నా వంతుగా రూ.లక్ష విరాళంగా అందించాను. గ్రామంలోని చెత్తను వర్మీ కంపోస్టుగా మార్చి పంచాయతీకి అదనపు ఆదాయం సంపాదిస్తున్నా. గ్రామంలో డిజిటల్ లైబ్రరీ ప్రారంభించాను.
-గాడ్గే మీనాక్షి ముఖ్రా(కే) సర్పంచ్
తీన్మార్ చంద్రవ్వగా నేను సుపరిచితురాలిని. సెంట్రల్ యూనివర్సిటీలో కూచిపూడిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత, మెదక్ జిల్లా స్త్రీల జానపద కళల మీద ఎంఫిల్ చేశాను. ఎంసీజేలో గోల్డ్‌మెడల్ సాధించాను. అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాను. ఇప్పటి వరకూ మూడువేల జానపద ప్రదర్శనలు ఇచ్చాను. సినిమాలు, లఘు చిత్రాల్లో నటించాను.
-పి.సుజాత, యాంకర్
పాత్రికేయ వృత్తి నా ప్రాణం. అక్షరాలే నా నేస్తాలు. లింగ వివక్షను ప్రశ్నించాను. మహిళలపై నేరాలను ఎత్తి చూపాను. అనేక సామాజిక సమస్యల పట్ల అక్షరమే ఆయుధంగా పోరాడాను. యునిసెఫ్, లాడ్లీ అవార్డులు అందుకున్నాను. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా నా ఆలోచనలను, అనుభవాలను, యాత్రా విశేషాలను పంచుకుంటున్నా. కాపీ ఎడిటర్, బులెటిన్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తించాను.
-స్వరూప పొట్లపల్లి, జర్నలిస్ట్
తెలంగాణ జానపద సాహిత్యం, బతుకమ్మ పాటల మీద పీహెచ్డీ చేశాను. బతుకమ్మ ఫౌండేషన్ స్థాపించాను. పాఠ్య పుస్తక రచయిత్రిని కూడా. ఇప్పటి వరకూ పదహారు రచనలు వెలువరించాను. జాన పదాలు ఏ జాతికైనా ఆత్మలాంటివి. వాటిని బతికించుకోవాలి. రేపటి తరాలకు భద్రంగా అందించాలి. నా రచనల అంతిమ లక్ష్యం కూడా అదే.
-డాక్టర్ బండారి సుజాత శేఖర్, జానపద సాహిత్యం
నాట్యకళ భారతీయ సంస్కృతిలో భాగం. నాట్య గురువుగా నేను ఎంతోమందికి కూచిపూడి నేర్పించాను. అనేక వేదికల మీద ఆ సంప్రదాయ నాట్యానికి ప్రాతినిధ్యం వహించాను. వివిధ పుస్తకాలు రచించాను. అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన పత్రాలు సమర్పించాను. శతాబ్దాల నాటి కూచిపూడి ప్రాథమిక మూల సామగ్రిని, వంశపారంపర్య గురువుల రచనలను భద్రపరిచి ‘ఆర్ట్ ఇండియా ఫౌండేషన్’ ద్వారా ప్రపంచానికి అందించాను.
-డాక్టర్ తడకమల్ల అనూరాధ,శాస్త్రీయ నృత్యకారిణి
తెలంగాణ ప్రభుత్వ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేశాను. ఆంగ్లభాష, సాహిత్య బోధనలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. నా నేతృత్వంలో ఎంతోమంది ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు పొందారు. వినూత్నమైన చిట్కాలతో ఆంగ్ల వ్యాకరణాన్ని సుబోధకం చేశాను.
-ప్రొఫెసర్ డి. కనకదుర్గ, కాలమిస్ట్, సామాజికవేత్త
మాది వైద్యుల కుటుంబం. శ్వాస ఉన్నంతవరకు రోగులకు సేవ చేయాలని నా కోరిక. కాకతీయ వైద్య కళాశాలలో చదువుకున్నా. గాంధీ వైద్య కళాశాలలో పీజీ చేశాను. ప్రస్తుతం పిల్లల వార్డు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నా. చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే నా తపన. వివిధ అంటురోగాలు, ప్రాణాంతక రుగ్మతల పట్ల జనంలో అవగాహన పెంచుతున్నా.
-డాక్టర్ పొన్నూరు మాలతి
అంగన్వాడి కేంద్రాన్ని శుభ్రంగా ఉంచడం, మెనూ ప్రకారం ఆహారం వండటం నా బాధ్యత. గ్రామంలోని గర్భిణులు, బాలింతలు, పిల్లలందరికీ పౌష్ఠికాహారం అందేలా చూస్తున్నా. సమావేశాల కోసం ఎక్కడికి వెళ్లినా.. పిల్లలకు వీడియోల రూపంలో కథలు, పాటలు పరిచయం చేస్తూనే ఉంటా.
-రజియా సుల్తానా, అంగన్వాడి కార్యకర్త
చిన్నపిల్లల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నాను. క్యాన్సర్ బాధితులకు జీవితాంతం సేవ చేయాలని నిర్ణయించుకున్నా. స్టోన్ ఫెలోషిప్తో 2011లో లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి పట్టా అందుకున్నా. వృత్తి జీవితంలో ఎన్నో మైలురాళ్లు దాటాను. ఇప్పుడు సమాజ సేవ కోసం పని చేస్తున్నా.
-సమంతారెడ్డి, సామాజిక కార్యకర్త
ఏడేళ్ల వయసులోనే క్రికెట్ అకాడమీలో చేరాను. బ్యాటర్‌గా, బౌలర్‌గా ప్రతిభ చాటి.. అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2023 కోసం భారత జట్టుకు ఎంపికయ్యాను. ఫైనల్ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి.. భారత్ కప్పు గెలవడంలో కీలకంగా మారడం ఆనందంగా ఉంది.
-గొంగడి త్రిష, స్టార్ క్రికెటర్
చిన్నప్పటి నుంచే కొండలు ఎక్కడమంటే సరదా. అందుకే.. ఎంబీఏ చేసినా, రాక్ ైక్లెంబింగ్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నా. 17 ఏండ్ల వయసు నుంచే పర్వతారోహణలో శిక్షణ పొందా. 7 ఖండాల్లో ఉన్న 7 ఎత్తయిన పర్వతాలు అధిరోహించాను.
-అన్వితరెడ్డి, రాక్ మౌంటెనీర్
భరోసా, షీ టీమ్స్‌లో పనిచేస్తూ.. అత్యాచార, పోక్సో, మహిళలపై వేధింపులు తదితర కేసులను బలంగా నమోదు చేశాను. పన్నెండు పోక్సో కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చేశాను. మత్తుమందుకు అలవాటైన యువతకు కౌన్సెలింగ్ ఇప్పించా.
-పి.రుక్మిణి, ఇన్స్పెక్టర్ (భరోసా, షీటీమ్స్)
పోలీసు ఉన్నతాధికారిగా మహిళలు, పిల్లలపై జరిగిన నేరాలకు సంబంధించి అనేక కేసులు పరిశోధించాను. ఎనిమిది వేల ఫిర్యాదులు పరిష్కరించాను. ఇరవైవేల డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాను. వంద బాల్యవివాహాలను నిలిపివేశాను. రెండువేల మంది చిన్నారులకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాను.
-సీ అనసూయ, ఐపీఎస్, (డీడీ, టీఎస్ పోలీస్ అకాడమీ)
సాహిత్యంలో పీహెచ్డీ చేశాను. పిల్లల కథలు, కవితలు, వ్యాసాలు, పజిల్స్ అందించాను. జనంలో వివిధ వ్యాధులకు సంబంధించిన అవగాహన కల్పిస్తున్నా. అనేకానేక రుగ్మతలను తెలిపే బొమ్మలను ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్‌పై ముద్రిస్తూ జనంలో ఆరోగ్య స్పృహ పెంచుతున్నా.
-డాక్టర్ కె.రాణీప్రసాద్, సాహిత్యం
సాహిత్యాన్ని అభిమానించే వారిని మెప్పించేలా అనేక కవితలు రాశాను. ‘ఇన్నాళ్ల మౌనం తర్వాత’ (2016), ‘లోపలి ముసుగు’(2022) పుస్తకాలు వెలువరించాను. ప్రస్తుతం ‘అమర్నాథ్ యాత్ర’ పుస్తకాన్ని రాస్తున్నా. రాష్ట్రస్థాయిలో అవార్డు రావడం సంతోషంగా ఉంది.
-అరుణ నారదభట్ల, సాహిత్యం
చిన్నప్పుడే కిన్నెర వాయించడం నేర్చుకున్నా. పన్నెండు మెట్ల కిన్నెరపై అవలీలగా రాగాలు పలికిస్తా. నా నైపుణ్యాన్ని గుర్తించి రవీంద్రభారతిలో అవార్డు అందించారు. ఇప్పుడు ఈ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది. కళలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది.
-కర్నె శంకరమ్మ, కిన్నెర వాద్య కళాకారిణి
పాలమూరు యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా. అంతరించిపోతున్న ఆదిమ తెగలపై పరిశోధనలు చేస్తున్నా. ఆ జాతుల మూలాలను కాపాడేందుకు పాటుపడుతున్నా. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నా. ఆ దిశగా సర్కారు సహకారం కోరుతున్నా.
-గూడూరు మనోజ, పరిశోధకురాలు
‘నేలమ్మ మహిళా రైతు పరస్పర సహకార సంఘం’ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించాను. కమ్యూనిటీ మొబిలైజర్గా ఒంటరి మహిళలు, చిన్న, సన్నకారు మహిళా రైతులతో కలిసి పనిచేశాను. రెండొందల మందికి వ్యవసాయం, జీవనోపాధి, ఆహార పంటలపై శిక్షణ ఇచ్చా.
-సామల్ల శ్వేత, మహిళా రైతు
అంగన్వాడి సూపర్వైజర్గా నా పరిధిలోని అన్ని కేంద్రాలనూ సందర్శిస్తాను. ప్రభుత్వం నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాను. సంక్షేమ పథకాలను సమర్థంగా పర్యవేక్షిస్తూ.. ప్రతినెలా వందశాతం ఎఫ్‌సీఆర్ పూర్తి చేయిస్తాను.
-జి.నందిని, అంగన్వాడి సూపర్వైజర్
నాకు చిన్నతనం నుంచే వైద్యవృత్తి అంటే మక్కువ. పట్టుబట్టి చదివి.. ఎంబీబీఎస్ పట్టా అందుకున్నా. చిన్నపిల్లల విభాగంలో పని చేశాను. ఎంతోమంది పేదలకు వైద్యం చేశాను. ఉద్యోగ విరమణ తర్వాత.. 15 ఏండ్లుగా ఉచితంగా వైద్య సేవలు
అందిస్తున్నాను.
-డాక్టర్ అమూల్య మల్లంగారి, వైద్యురాలు
మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. బాల్యం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్నాం. సరిగమలే ప్రధానంగా ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాం. మ్యూజిక్ టీచర్లుగా రాణిస్తూనే.. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాం.
-ఓని విజయ, వినోద, విజయలక్ష్మి, సంగీతం
రెండేళ్ల వయసులోనే పోలియోతో 90 శాతం వైకల్యం బారినపడ్డాను. అయినా, అధైర్యపడకుండా ముందుకు సాగుతున్నాను. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివాను. చిత్రకారిణిగా రాణిస్తూ.. ఎన్నో అవార్డులు అందుకున్నా. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ పేరు సాధించాను.
-నారా విజయలక్ష్మి, చిత్రకారిణి
-యెడ్ల హరీష్