చిన్నప్పటి నుంచీ బిజినెస్ చెయ్యాలనే ఆలోచన. తర్వాత చదువు.. పెండ్లి.. పిల్లలు. కాలక్షేపానికి ఆర్టిస్ట్‌గా మారినా.. ఏదో తెలియని వెలితి. అంతలోనే కరోనా. ఆరోగ్యం కోసం తాము ఉపయోగించే వస్తువులు విదేశాల నుంచి రావడం ఆగిపోయింది. దీంతో వెల్నెస్ ఉత్పత్తులను తానే ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అలా డింపుల్ అగర్వాల్ ఆంత్రప్రెన్యూర్‌గా మారారు.
ఓ మనిషి రోజువారీ ఆహారంలో కనీసం మూడు గ్రాముల కొలాజెన్ ఉండాలని నిపుణులు చెబుతారు. గుండెకు, చర్మానికి, కాలేయానికి, ఇతర అవయవాలకు కొలాజెన్ ఎంతో మేలు చేస్తుంది. ఉరుకులు పరుగుల కాలంలో అంత ప్రొటీన్ ఫుడ్ తినడం సాధ్యమేనా? అనే ప్రశ్నకు.. ‘వెల్నెస్ లాంగ్వేజ్’ అనే స్టార్టప్ ద్వారా సమాధానం చెబుతున్నారు డింపుల్ అగర్వాల్. సముద్ర, నదీ జలాల్లో సహజంగా పెరిగే క్యాట్‌ఫిష్‌ల నుంచి నాణ్యమైన హైడ్రొలైజ్డ్ మెరైన్ కొలాజెన్‌ను తయారు చేస్తున్నది ఈ అంకుర సంస్థ. అందానికి, ఆరోగ్యానికి ఉపయోగపడే కొలాజెన్‌ను పానీయం రూపంలోనూ తీసుకొచ్చింది. డింపుల్ హైదరాబాద్‌లోని స్టాన్లీ, భారతీయ విద్యాభవన్లలో చదువుకుంది. ఆ తర్వాత పెండ్లి.. పిల్లలు. కాలక్షేపానికి పెయింటింగ్ నేర్చుకుంది. కొన్ని వర్క్‌షాపులు నిర్వహించింది. అక్కడితో ఆగకుండా.. ఆంత్రప్రెన్యూర్‌గా కొత్త ప్రయాణం ప్రారంభించింది.
అన్నీ తానై..
సహజసిద్ధమైన ఉత్పత్తులను విదేశాల నుంచి తెప్పించుకొని మరీ వాడేవారు డింపుల్ అగర్వాల్, అమిత్ అగర్వాల్ దంపతులు. కరోనా సమయంలో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో.. తనే వాటి తయారీకి పూనుకున్నది. ఆ ప్రయత్నంలో సొంతంగా పరిశోధన ప్రారంభించింది. నేరుగా నిపుణులను కలుసుకుంది. ఫార్ములాలు తెలుసుకుంది. శాస్త్రవేత్తలు వాటికి కొన్ని మార్పులు సూచించి, తయారీకి ఆమోదం తెలిపారు. దీంతో ఇన్నాళ్లూ ఉద్యోగం ద్వారా సంపాదించుకున్న సొమ్మును పెట్టుబడిగా పెట్టింది. భర్త కూడా తనవంతుగా ప్రోత్సహించాడు. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)’ ఆమోదం రావడమే ఆలస్యం.. దాదాపు పన్నెండు రకాల ఉత్పత్తులను మార్కెట్‌కు పరిచయం చేసింది డింపుల్. భవిష్యత్‌లో 30 రకాల సహజసిద్ధ ఉత్పత్తులను తీసుకురావాలన్నది ఆలోచన.
కొలాజెన్ ఉత్పత్తులతో పాటు ‘ప్రొటీన్ కాఫీ’ని కూడా మార్కెట్‌కు పరిచయం చేసింది. దీనిని పాలలోనూ, వేడి నీళ్లలోనూ కలుపుకొని తాగొచ్చు. ఇది చర్మానికి, జుట్టుకు ఎంతో మేలుచేస్తుందనీ, నరాల బలహీనతను దూరం చేస్తుందనీ నిపుణుల భరోసా. అంతేకాదు, ఎసిడిటీ లెవల్స్నూ తగ్గిస్తుందని అంటున్నారు. ‘గ్లూటోథియాన్’ చర్మంపై నల్ల మచ్చలు, మొటిమలను నివారిస్తుంది. చర్మం కాంతివంతంగా మెరిసేందుకు సాయపడుతుంది. ‘మెలాటినెన్’ తీసుకుంటే సుఖనిద్ర వస్తుంది. అలసిన శరీరాలకు సాంత్వన చేకూరుస్తుంది. ఇక బరువును తగ్గించి, జుట్టు, పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే గమీస్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి బయోటిన్, మరొకటి ఆపిల్ సైడర్. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ప్రాచీనమైన ‘నాభిపురాణం’లో ప్రస్తావించిన ఆయుర్వేద మూలికల నుంచి తీసిన నూనెతో ‘బెల్లీ బటన్’ ఆయిల్‌నూ పరిచయం చేస్తున్నారు. ఈ తైలాన్ని పొట్ట, నాభి చుట్టూ రాసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. నిజానికి, ఇలాంటి ఉత్పత్తులకు విదేశాలలో గిరాకీ ఎక్కువ. కరోనా తర్వాత, మన దేశంలోనూ ఆరోగ్య స్పృహ అధికం అవుతున్నది. దీన్నో వ్యాపార అవకాశంగా మలుచుకోవాలని డింపుల్ ఆలోచన. ఆ దిశగా విజయం సాధిస్తున్నది.. ‘వెల్నెస్ లాంగ్వేజ్’.
‘లాంచ్‌ప్యాడ్’కు ఎంపికయ్యాం!
మా స్నేహితుల ద్వారా ‘వీహబ్’ గురించి తెలిసింది. మా ఉత్పత్తులను పరిశీలించాక వీహబ్ మార్కెటింగ్ సూత్రాలు బోధించింది. ఓ మెంటర్‌ను కేటాయించింది. వీహబ్ ఆవరణలోనే మాకు ఆఫీస్ స్పేస్ ఇచ్చింది. ఫండింగ్ కోసం లాంచ్‌ప్యాడ్ ఈవెంట్‌కు ఎంపిక చేసింది. ఇందులో కనుక విజయం సాధిస్తే.. కోరుకున్నంత మూలధనం సమకూరుతుంది. మా ఉత్పత్తులు www.wellnesslanguage.comతో పాటు వివిధ ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
– డింపుల్ అగర్వాల్, సీయీవో, వెల్నెస్ లాంగ్వేజ్
– రవికుమార్ తోటపల్లి