వదంతి: ద మిస్టరీ ఆఫ్ మణి
అమెజాన్ ప్రైమ్: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: శశికుమార్, యశ్వంత్, అనఘ, అపర్ణా దాస్, వివేక్ ప్రసన్న, రేవతి శర్మ తదితరులు, దర్శకత్వం: ఆండ్రూ లూయిస్
మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథలు.. ఎప్పుడూ ఎవర్గ్రీన్ హిట్లిస్ట్లోనే ఉంటాయి. ఎక్కడో మృతదేహం దొరకడం, హంతకుల కోసం పోలీసులు గాలించడం, ఆ క్రమంలో వారికి ఎన్నో సవాళ్లు ఎదురవ్వడం.. ఇలాంటివన్నీ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడతాయి. అలాంటి జోనర్లో 2022లో వచ్చిన ‘వదంతి: ద వేబుల్ ఆఫ్ వెలోని’ సూపర్ హిట్ సాధించింది. ఎస్. జె. సూర్య పోలీస్ అధికారిగా నటించిన ఈ తమిళ సిరీస్.. అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఆ మర్డర్ మిస్టరీ సిరీస్‌కి కొనసాగింపుగా.. ‘వదంతి: ద మిస్టరీ ఆఫ్ మణి’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా, మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌గా విడుదలై.. రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నది.
కథలోకి వెళ్తే.. చెన్నై-మదురై ఎనిమిది లైన్ల రోడ్ పనులు మొదలవుతాయి. ఎక్స్‌కవేటర్‌తో మట్టి తీస్తుండగా.. ఒక అస్థిపంజరం బయటపడుతుంది. మరోవైపు పడంబత్తూర్ పోలీస్ స్టేషన్‌కి ఎస్సై మూసా రజా (శశికుమార్) పనిష్మెంట్ పోస్టింగ్ కింద వస్తాడు. అతని ప్రతిభ, నిజాయితీ గురించి తెలుసుకున్న ఎస్పీ రతిక నాయర్ (అనఘ).. అస్థిపంజరం బయటపడ్డ కేసును రజాకి అప్పగిస్తుంది. తోటి ఆఫీసర్ రామర్ (వివేక్ ప్రసన్న)తో కలిసి ఇన్వెస్టిగేషన్లోకి దిగుతాడు రజా. అయితే, దొరికిన అస్థిపంజరానికి ఒక చేయి లేకపోవడంతో.. మళ్లీ తవ్వకాలు జరుపుతారు. అప్పుడు ఒక చేయి దొరుకుతుంది. కానీ, ఫోరెన్సిక్ నివేదికలో అస్థిపంజరం ఒకరిది, చేయి మరొకరిదని తేలుతుంది. ఆ రెండు అస్థిపంజరాలు ఇద్దరు యువతులవనే విషయం స్పష్టమవుతుంది.
ఆ దిశగా మొదలైన ఇన్వెస్టిగేషన్.. చెల్లిని-ప్రియురాలిని చంపిన నేరంలో జైలు శిక్ష అనుభవిస్తున్న మణి (యశ్వంత్) దగ్గరికి చేరుతుంది. దాంతో, మణిని జైలులో కలిసి మాట్లాడతాడు రజా. ఆ హత్యలు మణి చేసి ఉండకపోవచ్చని భావిస్తాడు. అదే విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి, ఆ కేసును రీ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఎస్సై రజాకు ఎలాంటి విషయాలు తెలుస్తాయి? అసలు మణి ఎవరు? ప్రియురాలు, చెల్లిని నిజంగానే హత్య చేశాడా? మణి హత్యలు చేయలేదని రజా ఎందుకు నమ్ముతాడు? అతనికి సైకో సీరియల్ కిల్లర్పైన ఎందుకు అనుమానం వస్తుంది? చివరికి ఈ కేసును రజా ఛేదించాడా? లేదా? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే!