వాతావరణ పరిస్థితులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో నీరు, ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువ. దీనివల్ల వ్యాపించే వ్యాధులలో ప్రధానమైంది.. టైఫాయిడ్. ‘సాల్మొనెల్లా టైఫి’ అనే బ్యాక్టీరియా వల్ల చిన్నపేగుకు వచ్చే ప్రమాదకరమైన అంటువ్యాధి ఇది. ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండుకోట్ల మందికి ఈ వ్యాధి సోకుతుందని అంచనా. వారిలో 2-6 లక్షల మంది మరణిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు తెలుపుతున్నాయి.
వ్యాప్తి: టైఫాయిడ్ బ్యాక్టీరియా నోటి ద్వారా శరీరంలో ప్రవేశించి చిన్నపేగును ఆశిస్తుంది. ఆ తర్వాత, వ్యాధిగ్రస్తుల మలంతో కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత లోపించిన ప్రదేశాలలో టైఫాయిడ్ త్వరగా విస్తరిస్తుంది. రోగకారక సూక్ష్మజీవి మంచు, నీరు, ఆహారంలో నెలలపాటూ జీవించగలదు. వ్యాధి వ్యాప్తికి మలం ప్రధాన కారణమైనా.. లాలాజలం, వాంతులు, ఇతర శరీర స్రావాల ద్వారానూ చొచ్చుకుపోతుంది. అందులోనూ ఈగలు ప్రధాన వాహకాలు.
లక్షణాలు: రోజురోజుకూ తీవ్రత పెరిగే జ్వరం, తలనొప్పి, అలసట, చికాకు, కడుపునొప్పి, మొదటి కొద్దిరోజులు మలబద్ధకం, ఆ తరువాత విరేచనాలు టైఫాయిడ్ రోగిలో కనిపించే ప్రాథమిక లక్షణాలు.
టైఫాయిడ్ ప్రారంభమైన 2-3 వారాలకు 5 శాతం పిల్లల్లో చిన్నపేగుకు రంధ్రం పడిపోయి, తీవ్రమైన రక్తస్రావం కావచ్చు. సరైన వైద్యం లభించకపోతే 20 శాతం పిల్లలు మరణించవచ్చు. వైద్యం లభించినా కూడా 1 శాతం మంది ప్రాణాలను కబళిస్తున్నది ఈ మహమ్మారి. వ్యాధి నుంచి కోలుకొన్న 3-5 శాతం పిల్లల్లో బ్యాక్టీరియా శరీరంలోని వివిధ భాగాలలో స్థిరనివాసం ఏర్పరచుకోవచ్చు. వీరు పైకి ఆరోగ్యంగానే కనిపించినా, వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారకులు అవుతారు. ఇలాంటివారిని ‘క్యారియర్స్’ అంటారు. దురదృష్టం ఏమిటంటే, గతంలో బాగా పనిచేసిన అనేక మందులు ఇప్పుడు ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. ఈ పరిస్థితిని ‘మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్’ అంటారు.
నివారణ: వ్యక్తిగత పరిశుభ్రత, రక్షిత మంచినీరు, ఆహార పరిశుభ్రత వ్యాధి నివారణకు ప్రధాన మార్గం. టైఫాయిడ్ టీకాను 9-12 నెలలకు మొదటి డోసు, రెండవ సంవత్సరం తరువాత బూస్టర్ ఇప్పించాలి. హెపటైటిస్-ఎ, టైఫాయిడ్ ఒకే విధంగా వ్యాపిస్తూ, ఒకే రకమైన పరిస్థితుల్లో నివసించే వారిలో కనిపిస్తాయి. కాబట్టి, ఈ రెండు టీకాలనూ ఒకేసారి ఇవ్వవచ్చు. టైఫాయిడ్ నుంచి కోలుకున్న వారికి కూడా 4 వారాల తరువాత టీకా ఇవ్వాలి. దీనివల్ల టైఫాయిడ్ రెండోసారి రాకుండా నివారించవచ్చు.
– డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు