చిన్నపిల్లల చెవికి సంబంధించిన సాధారణ సమస్యలలో జీబిలి ఒకటి. వాతావరణంలోని దుమ్ము, ధూళి చెవిలోకి ప్రవేశించకుండా నివారించే జిగురులాంటి పదార్థం ఇది. చెమటలానే ఇది కూడా కొందరిలో ఎక్కువగా, కొందరిలో తక్కువగా ఏర్పడుతుంది. దవడల కదలికల వల్ల దానంతట అదే బయటికి వస్తుంది కాబట్టి, బలవంతంగా బయటికి తీయడానికి బడ్స్ లాంటివి ఉపయోగించరాదు. బడ్స్ వాడటం వల్ల మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది. కర్ణభేరికి గాయమైనా కావచ్చు. కొన్నిసార్లు జీబిలి ఎక్కువగా ఏర్పడి, గట్టిపడిపోతుంది. దీంతో బయటికి రాకుండా చెవిలో అడ్డు పడవచ్చు. చెవి మూసుకుపోయినట్టు అనిపించడం, చెవుడు, చెవిలో వింత శబ్దాలు రావడం, తల తిరిగినట్టు, కింద పడిపోతున్నట్టు అనిపించడం, దగ్గు.. తరచుగా కనిపించే లక్షణాలు. స్నానం చేస్తున్నప్పుడు నీరు చెవిలోకి ప్రవేశిస్తే.. జీబిలి నీటిలో నానిపోయి ఉబ్బడం వల్ల కూడా ఈ లక్షణాలు అకస్మాత్తుగా ప్రారంభం కావచ్చు.
సరైన వైద్యం
జీబిలి గట్టిపడి దానంతట అదే బయటికి రాకుండా.. లోపలే నిలిచి పోయినప్పుడు, వైద్య నిపుణుడిని సంప్రదించాలి. జీబిలి మెత్తబడటానికి కొద్దిరోజులపాటు మందులు ఇస్తారు. లేదంటే, ‘సిరంజింగ్’ విధానంతో శుభ్రం చేస్తారు. ఈ పద్ధతిలో సిరంజితో చెవిలోకి నీరు పంపి, జాగ్రత్తగా బయటికి రప్పిస్తారు. కొందరు డాక్టర్లు ‘సెరుమెన్ హుక్’ అనే పరికరంతో కూడా తీసేస్తారు.
– డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు