సప్త సముద్రాల అవతల ఉన్న మనవరాలు.. ఇండియాలో ఉన్న బామ్మ లివింగ్ రూమ్‌లోకి వచ్చి పక్కనే కూర్చుని ముచ్చట్లు పెడితే ఎలా ఉంటుంది? ఫోన్ స్క్రీన్ అవసరం లేకుండా, గాలిలోనే 3డీ రూపంలో ప్రత్యక్షమయ్యే ఆ ‘హోలోగ్రామ్’ అద్భుతం మన జీవితాలను మార్చబోతోంది. వీడియో కాల్స్ యుగం ముగిసిపోతోంది.
ఇకపై మనం మాట్లాడటం కాదు, అవతలి వ్యక్తిని మన కళ్లముందే ‘సృష్టించుకోబోతున్నాం’. భవిష్యత్తులో ‘హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్’ ద్వారా దూరాలు పూర్తిగా మాయమైపోతాయి. అమెరికాలో ఉన్న మనవరాలు బోర్ కొడుతోందని ఒక బటన్ నొక్కగానే.. ఇండియాలో ఉన్న బామ్మ, కాంతి కిరణాల రూపంలో పక్కనే ఉన్న సోఫాలో ప్రత్యక్షమవుతుంది. వీఆర్ గ్లాసెస్ లాంటి కళ్లద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా, అచ్చం మనిషి నిలబడినట్టే గాలిలోనే ఆ రూపం కనిపిస్తుంది. బామ్మ వంట చేస్తుంటే, పక్కనే నిలబడి ముచ్చట్లు చెప్పొచ్చు. మనవరాలు చదువుకుంటుంటే బామ్మ పక్కనే కూర్చుని పర్యవేక్షించవచ్చు.
ఈ టెక్నాలజీ వల్ల ఒంటరితనంతో బాధపడే వృద్ధులకు, ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉండే బామ్మలకు ఒక గొప్ప మానసిక తోడు దొరుకుతుంది. పండగలు, పబ్బాలకు అందరూ ఒకేచోట లేకపోయినా, హోలోగ్రామ్స్ ద్వారా ఒకే డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని భోజనాలు చేస్తున్న అనుభూతిని పొందవచ్చు. ప్రపంచంలో ఎక్కడో ఉన్నా, ఒకే గదిలో ఉన్నామనే భ్రాంతిని ఈ కాంతి కిరణాలు కలిగిస్తాయి.
అయితే, ఈ సాంకేతికతలో ఒకేఒక్క లోటు ఉంది. కళ్లకు అచ్చం మనిషిలాగే కనిపిస్తున్నా, ఆ రూపాన్ని మనం తాకలేం. మనవరాలి తలపై బామ్మ చేయి వేసి దీవించలేదు, బామ్మ చేతిని మనవరాలు పట్టుకోలేదు. కాంతి కిరణాలు రూపాన్ని ఇవ్వగలవు కానీ, స్పర్శను ఇవ్వలేవు కదా! అందుకే, ఈ హోలోగ్రామ్ ప్రపంచంలో డిజిటల్ రూపాలను చూసి మురుస్తూనే, వీలైనప్పుడు నేరుగా వెళ్లి బామ్మను గుండెలకు హత్తుకోవడమే నిజమైన ‘జిందగీ’!