పిల్లల కథలంటే ముందు గుర్తొచ్చే పేరు మాడభూషి లలితా దేవి. పిల్లల్ని బుజ్జగించి కథల వర్క్‌షాప్‌కి తీసుకెళ్తుందామె. బతిమాలి కథలు రాయిస్తుంది. బాగా రాసిన కథలకు బహుమతులిస్తుంది. భవిష్యత్ కథకుల కోసం ‘తెలుగు కథ పుట్టుపూర్వోత్తరాలు’ చెబుతుంది. ఎవరి నుంచీ పైసా ఆశించకుండా, ఎవరు రూపాయి ఇస్తామన్నా తీసుకోకుండా పాతికేళ్ల నుంచి తన పని తాను చేసుకుపోతున్నది! ఇంత పెద్ద వయసులో ఎందుకీ భారం ఎత్తుకున్నారంటే? ‘పిల్లలంటే ప్రేమ. తెలుగంటే అభిమానం. కథలంటే ప్రాణం. అన్నిటికీ మించి మా ఆయనంటే గౌరవం. ఆయన ప్రేమించిన వాటినే నేనూ ప్రేమిస్తున్నా’ అంటున్న మాడభూషి లతితా దేవి చెప్పిన కథల ముచ్చట్లు ఇవి.
మనం తెలుగు వాళ్లం అయి ఉండి, తెలుగు ప్రాంతంలో ఉండి, తెలుగుని ఇష్టపడట్లేదని మా ఆయన బాధపడేవాడు. పిల్లలకు తెలుగు పట్ల ఆసక్తి కలిగించే కార్యక్రమం ఏదైనా చేయాలని ఆయన కోరిక. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని ఆయన అనుకునేవారు. పదవీ విరమణ తర్వాత పిల్లల కార్యక్రమం ఒకటి మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ, అనుకున్న రోజునే.. ఆయన అకస్మాత్తుగా కన్నుమూశారు.
మా ఆయన కలను నిజం చేయాలనే ఉద్దేశంతో ‘మాడభూషి రంగాచార్య స్మారక సంఘం’ ఏర్పాటు చేశాను. దీనికి ప్రారంభం నుంచి నేను కన్వీనర్‌గా పని చేస్తున్నాను. శీలా వీర్రాజు గారు అధ్యక్షులు, సుధామ, చంద్రశేఖర్ రెడ్డి, నాళేశ్వరం శంకరం, రాధాకృష్ణమూర్తి సభ్యులు. శీలా వీర్రాజు గారి సహకారంతో మా ఆయన రాసిన కథల్లో కొన్నింటిని ఎంపిక చేసి కథల పుస్తకం ప్రచురించాను. మొదటి సంవత్సరికం రోజున జ్వాలాముఖి, కేకే రంగనాథా చార్యులు, శీలా వీర్రాజు, సుధామ ఆ కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు.
మా ఆయన కల ఒక్కటే. పిల్లలకు తెలుగు పట్ల ఆసక్తి పెంచాలి. పిల్లలు కథలంటే ఇష్టం. కాబట్టి కథల పోటీ పెట్టి తెలుగు భాషపట్ల ఆసక్తి కలిగించవచ్చని ఇరవై ఏళ్ల క్రితం పిల్లలకు కథల పోటీ పెట్టాం. జంట నగరాల్లోని పాఠశాలల పిల్లలు వంద మందికిపైగా కథలు పంపారు. ఉత్తమ కథలకు బహుమతులు ఇచ్చాం. చాలా పాఠశాలలకు నేను వెళ్లేదాన్ని. మీ బడిలో కథలు రాసే పిల్లలు ఉంటే వాళ్ల కథలు పోటీకి పంపమని అడిగేదాన్ని. కొన్ని పాఠశాలల నుంచే కథలు వస్తున్నాయి. రాని పాఠశాలల నుంచి కథలు వచ్చేలా ఏం చేయాలని ఆలోచిస్తుంటే.. పిల్లలకు కథలు రాయడం నేర్పాల్సిన అసవరం ఉందిన మిగతా సాహితీ మిత్రులు చెప్పారు. కొన్నాళ్లకు కథల వర్క్‌షాప్ నిర్వహణకు పూనుకున్నాం. మాడభూషి రంగాచార్య స్మారక కమిటీ నిర్వహించే కథల వర్క్‌షాప్‌కి పిల్లలు బాగానే వచ్చారు. కథకులు వారికి చక్కగా శిక్షణ ఇచ్చారు. అప్పటి నుంచి ఏటా నిర్వహించే బాలల కథల పోటీకి నాలుగు వందల నుంచి అయిదు వందల కథలు వస్తున్నాయి. బాల కథకులు పెరిగారు. పోటీకి వచ్చిన ఉత్తమ కథల్ని ప్రచురిస్తున్నాం.

ఏడాదికోసారి జరిగే కథల పోటీ నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 25న, మార్చి 11న కథా కార్యశాల నిర్వహిస్తున్నాం. ఏడాదిలో రెండుసార్లు నిర్వహించే కథల వర్క్‌షాప్‌కి కొన్ని పాఠశాలల నుంచే వస్తున్నారు. మరికొన్ని పాఠశాలలు రావట్లేదు. వాళ్లందరినీ భాగస్వామ్యం చేయాలని ఆ స్కూళ్లకు వెళ్లాను. పిల్లలతో కథలు రాయించమని అడిగాను. వాళ్ల జీవితానుభవాలను కథలుగా మలచడం నేర్పించమని చెప్పాను. ఆ టీచర్లు మాకు దాని గురించి తెలియదన్నప్పుడు, మా దాకా రాలేని పిల్లల కోసం పాఠశాలలోనే వర్క్‌షాప్ నిర్వహించాను. ఆయా పాఠశాలల యాజమాన్యాలు సాదరంగా ఆహ్వానించేవి. ‘రిటైర్ అయి ఇంట్లో కూర్చోక ఎందుకమ్మ నువ్వు తిప్పలు పడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడతావ్’ అన్నవాళ్లూ ఉన్నారు ఈ ప్రయాణంలో. వాళ్లు ఏమనుకున్నా మేం పిల్లలకు చెప్పాల్సింది చెప్పాం. కథలు రాయించాం. మంచి కథలకు బహుమతులు ఇచ్చాం. పుస్తకాలు ప్రచురించాం.
తెలుగు కథకు రేపటి కోసం కథకుల్ని తయారు చేస్తున్నాం. కానీ, కొత్త తరానికి పాత కథ తెలియదు. కథకులూ తెలియట్లేదు. కాబట్టి తెలుగు కథ చరిత్రనూ రికార్డు చేయాలి. రేపటి తరానికి అందించాలని ‘తెలుగు కథానిక పుట్టు పూర్వోత్తరాలు’ పరిశోధకులతో రాయించి, ప్రచురిస్తున్నాం. తెలుగు కథ ఎలా మొదలై, ఎటు ప్రయాణం చేస్తుందో కాల విభజన చేసుకుంటూ ప్రచురిస్తున్నాం. అలాగే కథా ప్రపంచంలోని పాత తరం కథా రచయితల కథలను విశ్లేషిస్తూ పుస్తకాలు ప్రచురిస్తున్నాం. ఏడాదికి ఒక సంపుటి చొప్పున ప్రచురిస్తున్నాం. ప్రతి సంపుటిలో ముగ్గురు కథకులు, వారి కథల గురించి విశ్లేషిస్తున్నాం.
నేను ఏనాడూ ఎవరినీ రూపాయి అడగలేదు. ఎవరైనా రూపాయి ఇస్తామని వచ్చినా తీసుకోలేదు. కథల పోటీ నిర్వహణ, ఉత్తమ కథలకు బహుమతులు, పుస్తక ప్రచురణ, సభలు, వర్క్‌షాప్‌ల నిర్వహణ కోసం మా ఆయన వల్ల నాకు వచ్చే పెన్షన్ డబ్బులే ఖర్చు చేస్తాను. ప్రతి నెలా వచ్చే పెన్షన్ కథల కోసం పక్కకు పెడతాను. వాటిలో రూపాయి కూడా నా కోసం వాడుకోను. నా పిల్లలు చేతికొచ్చారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సంపన్నులం కాకపోవచ్చు. నలుగురికి సాయం చేయాలంటే సంపదే ఉండాల్సిన అవసరం లేదు. మనసుంటే చాలు. మా ఆయన కల నెరవేరుతుందన్న సంతప్తి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. సంతోషం కోసం మేమూ పిల్లలను ప్రోత్సాహిస్తామంటూ పత్తిపాక మోహన్, ప్రమీల, నీరజ ముందుకొచ్చారు. వాళ్లూ కొంతమంది పిల్లలకు కన్సొలేషన్ బహుమతులు ఇస్తున్నారు. మాడభూషి రంగాచార్య స్మారక సంఘంలో శీలా సుభద్రా దేవి, సుధామ, నాళేశ్వరం శంకరం, గరిపెల్లి అశోక్ వంటి సాహితీ మిత్రులతో కలిసి భాష, సాహిత్యం, పిల్లల పట్ల ప్రేమతో చేస్తున్న క్రతువు ఇది. మా ప్రయత్నం ఫలించి వేలాది మంది పిల్లలు కథలు రాశారు. రాస్తున్నారు. రేపు వాళ్లే మా ఆశ. మన భవిష్యత్.

మా ఆయన (మాడభూషి రంగాచార్య)కు తెలుగు భాష, సాహిత్యాలంటే ఎంతో ఇష్టం. తను బీఏ (గణితం) చదివారు. తెలుగు భాష పట్ల తనకున్న ప్రేమ వల్ల ఓరియంటల్ కళాశాలలో ఎంఏ తెలుగు చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగులో ఎంఫిల్, పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. రైల్వేలో (క్యాషియర్) ఉద్యోగం చేస్తూనే సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉండేవారు. తన పరిశోధన కోసం అధ్యయనం చేసే పుస్తకాలను నన్ను చదవమని చెప్పేవారు. తర్వాత ఆ పుస్తకంపై నా అభిప్రాయం అడిగేవారు. అలా చదవడం వల్ల నాకు సాహిత్యం పట్ల అభిమానం పెరిగింది. నేనే ఓరియంటల్ కళాశాలలో ఎంఏ తెలుగు చదివాను. ఓ ప్రైవేట్ స్కూల్లో తెలుగు టీచర్‌గా ముప్పై రెండేళ్లు పని చేశాను.